Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:03 AM
సికింద్రాబాద్ పరిధిలోని భోలక్‌పూర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
సికింద్రాబాద్, జనవరి8 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధిలోని భోలక్‌పూర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో ఇవాళ(గురువారం) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.
మూడు ఫైరింజన్లతో..
అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్క్రాప్ గోడౌన్‌లో ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థాలు ఉండటంతో మంటలు వేగంగా ఎగసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో అప్రమత్తమైన అధికారులు సమీప ఇళ్లను ఖాళీ చేయించారు.
భారీగా ఆస్తి నష్టం
ఈ అగ్నిప్రమాదంలో గోడౌన్‌లో ఉన్న స్క్రాప్ పూర్తిగా దగ్ధమైంది. లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అగ్ని ప్రమాదం వల్ల దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
స్థానికుల్లో భయాందోళన..
ఈ అగ్ని ప్రమాదంతో భోలక్‌పూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా మళ్లించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి పోలీసులు భద్రతా చర్యలు పెంచారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది నిరంతర ప్రయత్నాలతో మంటలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని సమాచారం. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పిన అనంతరం నష్టం అంచనాపై అధికారిక నివేదిక విడుదల చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News