Kishan Reddy: ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:09 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వరంగల్ కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని సూచించారు.
ఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఇవాళ(మంగళవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వరంగల్ కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని సూచించారు. కోట భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కోట భూముల్లోని ఆక్రమణదారులను తొలగించడం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు.దాదాపు 250 సంవత్సరాలపాటు కాకతీయుల రాజధానిగా కీర్తిగడించి ఘనమైన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వైభవంతో అలరారిన ఓరుగల్లు (వరంగల్) పట్టణం.. తెలంగాణ వారసత్వ సంపదకు నిలయంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు కిషన్‌రెడ్డి.
కాకతీయుల కాలంలో ఇతర రాజ్యాల నుంచి ఎదురయ్యే దండయాత్రల నుంచి రాజధానికి రక్షణ కల్పించటం కోసం ఒక ప్రణాళిక ప్రకారం 7 ప్రాకారాలతో వరంగల్ కోటను ఎంతో పకడ్బందీగా నిర్మించారని పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానులు, హైదరాబాద్ నవాబుల దాడులను ఎదుర్కొన్న కోటని అభివర్ణించారు. నేటికీ కాకతీయుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ కోటను సందర్శించి కోటలో దాగి ఉన్న శిల్ప సంపద, నిర్మాణ నైపుణ్యం, వందలాది ఆలయాలు, వాటి నేపథ్యం, కోట ప్రాధాన్యం గురించి తెలుసుకుంటున్నారని వెల్లడించారు కిషన్‌రెడ్డి.
పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రప్రభుత్వం ఇటీవలే సౌండ్, ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పర్యవేక్షణలో ఉన్న వరంగల్ కోట పరిరక్షణకు, నిర్మాణాల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ వరంగల్ కోటకు చుట్టూ ఉన్న 7 ప్రాకారాల్లో ప్రస్తుతం 3 ప్రాకారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు కిషన్‌రెడ్డి.
ఈ 3 ప్రాకారాలతో పాటు ఇతర ప్రాకారాలను కొంతమంది స్థానికులు ఆక్రమించి కోట భూముల్లో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని వెల్లడించారు. వరంగల్ కోట ASI అధీనంలో ఉన్న ఒక స్మారక ప్రదేశమని, దీనికి సంబంధించిన భూములను ఆక్రమించడం, అందులో అక్రమంగా నిర్మాణాలను నిర్మించడం చట్టరీత్యానేరమని చెప్పుకొచ్చారు. వెంటనే ఆక్రమించిన భూములను ఖాళీ చేయాలని కోరుతూ ASI అధికారులు ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చారని ప్రస్తావించారు కిషన్‌రెడ్డి.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ASI అధికారులు 04.11.2022న అలాగే, ఇటీవల 01.12.2025న వరంగల్ జిల్లా కలెక్టర్‌కి పలుమార్లు లేఖలు రాశానని గుర్తుచేశారు. తాను లేఖ రాసిన కోట భూములను పరిరక్షించటానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ఎటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News