ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:59 PM
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.
ఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో... శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపమని అన్నారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు(బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.
ప్రజాస్వామ్యానికే చేటు..
గాంధీభవన్‌లో సంసారం చేస్తూ...కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపులు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికే చేటని బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి.. ఆ పార్టీలోకి ఆహ్వానించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. శాసన వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారని ఆగ్రహించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ ఆఫీసులో బంధించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. శాసనసభ స్పీకర్... స్వతహాగా వ్యవహరించాలే తప్ప డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా వ్యవహరించ కూడదని హితవు పలికారు.
ఆ బాధ్యత ప్రజలదే..
ప్రజాస్వామ్యవాదులారా ఇప్పటికైనా నోరు విప్పాలని బండి సంజయ్ కోరారు. పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేమని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో అనర్హత పిటిషన్‌పై అక్కడి అసెంబ్లీ స్పీకర్ ఇదే తరహా తీర్పు ఇస్తే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కొట్టేసిందని ప్రస్తావించారు. తెలంగాణలోనూ ఫిరాయింపులపై చెంప చెళ్లుమనేలా న్యాయ వ్యవస్థ తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉందని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రిసార్ట్‌లో సౌకర్యాలు ఉండేవి ఇలాగేనా.. వారిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
Read Latest International News And Telangana News And AP News And Telugu News