ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Mar 09 , 2026 | 02:35 PM
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ కోసం తెలంగాణ క్రీడాకారులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ కోసం తెలంగాణ క్రీడాకారులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. క్రీడాశాఖపై సచివాలయంలో ఈరోజు(సోమవారం) మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చించారు.
ఆ స్టేడియాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి..
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించడంతోపాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. ఈ డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రణాళికలు సిద్ధం చేయాలి..
ఒలింపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియాలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, SAT ఎండీ సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సీఎంతో మంత్రి తుమ్మల భేటీ...

సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలసి వివిధ అంశాలపై చర్చించారు. సిద్దిపేట జిల్లాలో నర్మెట్ట ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి సమయం కోరారు. కొహెడ మార్కెట్ పనులను త్వరితగతిన చేపట్టడానికి తగు ఆదేశాలను ఇవ్వాల్సిందిగా సూచించారు. రైతుల సౌకర్యార్థం త్వరలోనే శనగ, పొద్దుతిరుగుడు, మినుము, వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వెలుగుమట్లలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని మంత్రి తుమ్మల విన్నవించారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్
Read Latest International News And Telangana News And AP News And Telugu News