Share News

విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:35 PM

ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు.తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.


ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు..

ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.


మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే మా లక్ష్యం..

మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పెంచే ప్రణాళికలను తయారు చేశామని వివరించారు. హైదరాబాద్‌ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చాలని సూచించారు. చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని అన్నారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ORR బయటకు పంపిస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయాలంటూనే.. ప్రభుత్వాన్ని ఏం చేయొద్దంటున్నారని అన్నారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.


ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తాం..

2026 డిసెంబర్ నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఆటోలనూ ఎలక్ట్రిక్‌గా మార్చుతామని అన్నారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500కోట్లు అని ప్రతిపక్షాల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. గాంధీ విగ్రహానికి రూ.70కోట్లే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. ఈ విగ్రహం దగ్గర విజ్ఞాన కేంద్రానికి రూ.100కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. మహిళలకు రక్షణ మాత్రమే కాదని.. అవకాశాలు కూడా కల్పిస్తామని వివరించారు. సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారన్నారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాల నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్ విషయంలో రాద్ధాంతం చేశారని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా..? , తొలగింపులు వద్దంటున్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.


నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం..

కాలుష్యంతో హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. నదుల బఫర్ జోన్లలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. అలాంటి చోట నిర్మాణాలు చేపట్టినా తొలగించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. బఫర్ జోన్ల పరిధిలో 50మీటర్ల లోపల ఉంటే ఇళ్లకు విలువ ఉండదని తెలిపారు. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నష్ట పరిహారం ఇచ్చే బఫర్ జోన్‌లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని భరోసా కల్పించారు. మూసీ నిర్వాసితులకు ఏం కావాలో చర్చిస్తే బాగుంటుందని అన్నారు. ఈనెల 13వ తేదీన మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పుకొచ్చారు. డీపీఆర్ కూడా ప్రెజెంట్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవి: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 02:03 PM