పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:13 PM
పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఈ పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకూడదని సూచించారు.
తిరుపతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) వ్యాఖ్యానించారు. ఈ పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకూడదని సూచించారు. అవి సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 22వ స్నాతకోత్సవ వేడుకలు ఈరోజు(శనివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్, ఆయన సతీమణి సమీరా నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ స్నాతకోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త శశికళ సిన్హాకు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించారు.
విద్యార్థులకు పురస్కారాలు..
స్నాతకోత్సవ వేడుకల్లో విద్యార్థులకు పెద్ద సంఖ్యలో పురస్కారాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం 102 బంగారు పతకాలు అందజేశారు. అదేవిధంగా పలువురు విద్యార్థులకు నగదు బహుమతులు కూడా ప్రదానం చేశారు. ఈ వేడుకలో భాగంగా 2591 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ, ఎంఫిల్, పీజీ డిగ్రీలు ప్రదానం చేశారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో డిగ్రీలు స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు.
మహిళా విద్య సమాజ అభివృద్ధికి కీలకం..
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించారు. విద్య మనిషికి కేవలం ఉద్యోగ అవకాశాలకే కాకుండా బాధ్యత, మార్గదర్శనం, లక్ష్య నిర్దేశం కూడా ఇస్తుందని వ్యాఖ్యానించారు. చదువుకున్న మహిళలు కేవలం తమ కుటుంబాల అభివృద్ధికే కాకుండా దేశ ఆర్థిక ప్రగతికి, సామాజిక స్థిరత్వానికి కూడా ప్రధాన కారణమవుతారనిపేర్కొన్నారు. మహిళా విద్య సమాజ అభివృద్ధికి కీలకమని వివరించారు.
పరిశోధన రంగాల్లో పురోగతి..
సమాజానికి ప్రయోజనం కలిగించే పరిశోధనలు చేయాలని విద్యార్థులను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రోత్సహించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు ఇప్పటికే అనేక జాతీయ సంస్థలకు ఉపయోగపడుతున్నాయని అభినందించారు. విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన రంగాల్లో మంచి పురోగతి సాధిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. తన ప్రసంగం ముగింపు సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్.. ‘దేవి మహత్యం’ నుంచి కొన్ని శ్లోకాలు చదివి వినిపించారు. స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ చరిత్రలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచిందని అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు
జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలి: పవన్ కల్యాణ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News