Share News

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:43 PM

వైసీపీకి ప్రతిపక్షహోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని... ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి (YSRCP) ప్రతిపక్షహోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని... ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాకు తగ్గట్లుగా సీట్లు జగన్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కానీ బాధ్యత లేకుండా వైసీపీ సభ్యులు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం చంద్రబాబు ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీలో మాట్లాడారు.


రెండు ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయి..

ఏపీ కూటమిలోని మూడు పార్టీల్లోనూ చాలామంది కొత్త సభ్యులు వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటి ప్రభుత్వంపై పోరాడిన వారిలో చాలామందికి సీట్లు ఇచ్చామని ప్రస్తావించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థుల్లో 94శాతం మందిని గెలిపించారంటే.. అది తమపై ప్రజలకు ఉన్న నమ్మకమని ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత భుజస్కందాలపై పెట్టుకుని తాము ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. తాను నాలుగుసార్లు సీఎంగా పనిచేశానని.. ఇలాంటి అస్తవ్యస్థమైన వారసత్వ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు రాలేదని చెప్పుకొచ్చారు. ఈసారి రూ.3.32లక్షల కోట్ల ప్రోగ్రెసివ్ బడ్జెట్ పెట్టామన్నారు. మూడు పార్టీల నేతలతో కలిసి సమన్వయంతో ముందకెళ్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


భావితరాల భవిష్యత్ నిర్ణయించేలా చర్చలు..

గడచిన 15 రోజులుగా శాసనసభలో ఐదు కోట్లమంది ప్రజల భవిష్యత్తు గురించి చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘భావితరాల భవిష్యత్ నిర్ణయించేలా ఈ సమావేశాల్లో చర్చలు, నిర్ణయాలు జరిగాయి. విపక్ష పార్టీ సభకు హాజరు కాకుండా ప్రజా సమస్యలను వదిలేసినా.. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇక్కడ చర్చించాం. విభజన వల్ల, గత పాలకుల విధ్వంసం వల్ల నష్టపోయిన ఏపీని పున:నిర్మాణం చేసుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థుల్లో 94 శాతం మంది గెలవటం మా అందరిపైనా ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఎన్డీఏ పక్షాలు పూర్తి సఖ్యతతో ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జగన్ హయాంలో ఏపీ తీవ్ర అగమ్య గోచరంగా మారిపోయింది. గత పాలకులు ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. వైసీపీ హయాంలో ఎమ్మార్వో ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్ హౌస్ లాంటి ఆస్తులు తాకట్టు పెట్టారు. 12,13 శాతాలకు వడ్డీలు తెచ్చి ప్రభుత్వ ఆర్థిక వనరులను దుర్వినియోగం చేశారు. రూ.43,298 కోట్ల విలువైన అప్పులు రీషెడ్యూల్ చేయించాం. తద్వారా రూ.328 కోట్ల మేర ఆదా అవుతుంది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.


పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేశారు..

మరో రూ. ఒక కోటి మేర అప్పులు కూడా రీషెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రూ.1658 కోట్లు ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. ఈ నిధులతో మరో సంక్షేమ పథకం అమలు చేసే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు శరవేగంగా చేపట్టాం. ఓ వ్యక్తి తన స్వార్ధంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తాం. ఎక్కడా లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకుంటాం. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి రాజధానిని ట్రాక్‌లో పెట్టాం. మూడేళ్లలో రాజధానికి ఓ రూపు వస్తుంది. వచ్చే సెషన్‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం నిధులతో విశాఖపట్నం ఉక్కును కాపాడుకున్నాం. తొలిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తోంది. రాష్ట్రానికి నీటి భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. గడచిన 20 నెలల్లో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. హంద్రీనీవాకు రూ.3850 కోట్లు మంజూరు చేసి కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. అనంతపురం లాంటి జిల్లాలకు 55 టీఎంసీల నీటిని తీసుకెళ్లాం. ప్రస్తుతం వేసవి వచ్చినా 628 టీఎంసీల నీరు వివిధ రిజర్వాయర్లలో నిల్వ ఉంది. సమర్థ నీటి నిర్వహణతోనే ఇది సాధ్యమైంది. భూగర్భజలాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో 2.96 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగేలా వివిధ సంరక్షణా చర్యలు చేపట్టాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


కరెంటు ఛార్జీలు పెంచం..

భూగర్భజలాలు పెరగటం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నామని అన్నారు. ‘ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, ఆ మాట నిలబెట్టుకున్నాం. గత పాలకులు 32 వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం ప్రజలపై మోపారు. గత పాలనలో ట్రూ అప్ భారం వేస్తే మేం చరిత్రలో తొలిసారి ట్రూడౌన్ చేశాం. రూ.4,420 కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకున్నాం. పీఎం సూర్యఘర్ ద్వారా ఎస్సీ, ఎస్టీ లకు ఉచితంగా సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాం. ఈ ఏడాది ప్రతీ యూనిట్ కొనుగోలు ధరను రూ. 5.19 నుంచి 4.80లకు తగ్గించేలా చర్యలు చేపట్టాం. అగ్రిటెక్ అనేది ఓ విధానంగా మార్చుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రూ.లక్ష కోట్లతో ఉమ్మడి ప్రకాశం జిల్లాతో సహా రాయలసీమ జిల్లాలను హార్టీ కల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే పది సూత్రాలతో 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పన చేశాం. పీ4 కార్యక్రమంలో భాగంగా ఎంబీకే 10-20 కింద మరో కార్యక్రమం చేపట్టాం. ఆర్థిక అసమానతలు తగ్గించేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. త్వరలోనే ప్రతీ కుటుంబానికి ఫ్యామిలి బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం కార్డును కూడా జారీ చేస్తాం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్నీ పథకాలను ఈ కార్డు ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కు.. పవన్ కల్యాణ్ ధ్వజం

ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 02:08 PM