ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:05 AM
ఏపీలో ఆహార కల్తీ నివారణ చర్యలపై ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ విషయంపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఆహార కల్తీ నివారణ చర్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అసెంబ్లీలో ప్రశ్నించారు. ఆహారం ఔషధమని చెప్పారని... కానీ ఇప్పుడు ఆహారమే విషంగా మారుతోందని అన్నారు. బియ్యం నుంచి... దేవుడు ప్రసాదం వరకూ అన్ని కల్తీ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు లేకపోవటం వల్ల విచ్చలవిడిగా కల్తీ జరుగుతోందని పేర్కొన్నారు. కల్తీ ఆహారం కారణంగా జీర్ణ, నాడీ వ్యవస్థ పాడైపోతున్నాయని, క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని వెల్లడించారు. ఆహార కల్తీ నియంత్రణపై గతంలో జీవో తెచ్చినా వైసీపీ హయాంలో సరిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. దీంతో కల్తీ నియంత్రణలో ఏపీ చివరి స్థాయికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిబ్బందిని పెంచి, ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. కంటికి ఇంపుగా, నోటికి రుచిగా ఉంటే చాలదని.. కల్తీపై అవగాహన పెరగాలని సూచించారు.
యూరియాతో పాలు తయారు చేస్తున్నారు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
అయితే, ఆహార కల్తీ నివారణ చర్యలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ప్రశ్నించారు. పాల కల్తీ ఇటీవల పెరిగిందని.. యూరియాతో పాలు తయారు చేస్తున్నారని అన్నారు. అలాగే, జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రమాదకర టేస్టింగ్ సాల్ట్‌ను ఏపీలో నిషేధించాలని డిమాండ్ చేశారు. పామాయిల్‌తో పాటు తక్కువ నాణ్యత ఉన్న నూనెలను హోటళ్లలో వాడుతున్నారని తెలిపారు. ఆహారంలో రంగుల వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆహార కల్తీపై ఎలాంటి నియంత్రణ లేదని.. జిల్లాకు కేవలం ఇద్దరే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని తెలిపారు. దీనివల్ల వారు తనిఖీలు విస్తృతంగా నిర్వహించలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఆహార కల్తీ నిర్థారించే ప్రయోగశాలలు పెంచుతాం: మంత్రి సత్యకుమార్
ఆహార కల్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు. ఏపీలో ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. 2023 నుంచి 2026 వరకూ 16వేల700 ఆహార నమూనాలు పరిశీలించామని వివరించారు.14వందల నమూనాల్లో కల్తీ ఉన్నట్లు తేలిందన్నారు. బాధ్యులను కోర్టుల్లో పెట్టి జరిమానాలు, తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహించారు.
జగన్ హయాంలో ఆహార సిబ్బంది నియామకాలు సరిగా చేయలేదని, ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు. సింథటిక్ రంగులు ఆహార పదార్థాల్లో వాడుతున్నారని తెలిపారు. దీనిపై గుంటూరు, రాజమహేంద్రవరంలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నామని అన్నారు. సింథటిక్ రంగులు ఆహారాన్ని కల్తీ చేయటంతో పాటు ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చెప్పుకొచ్చారు. వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆహార కల్తీ నిర్థారించే ప్రయోగశాలలు పెంచుతామని అన్నారు. కల్తీకి పాల్పడే వారికి ప్రస్తుత చట్టం ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే శిక్ష పడుతోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
Read Latest Telangana News And AP News And Telugu News