అంగన్‌వాడీ సమస్యలపై అసెంబ్లీలో చర్చ
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:26 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(గురువారం) శాసన సభలో అంగన్‌వాడీల అంశంపై చర్చించారు.
అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(గురువారం) శాసన సభలో అంగన్‌వాడీల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పాక్షికంగా పూర్తయిన అంగన్‌వాడీ భవనాల అంశంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ప్రశ్నించారు. ఈ విషయంపై తెలుగుదేశం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. అంగన్‌వాడీల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని తాము వెళ్లినప్పుడు ఆయా కేంద్రాల్లో ఐదుగురు మాత్రమే ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఇది భారీ కార్యక్రమమని.. చాలా మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. కడియం మండలంలో స్థానిక సంస్థల నిధులతో అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేశారని గోరంట్ల బుచ్చయ్య ప్రస్తావించారు.
వారికి గ్రాట్యూటీ ఇస్తాం: మంత్రి సంధ్యారాణి
అలాగే ఇదే అంశంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు. ఏపీ వ్యప్తంగా 55,746 అంగన్‌వాడీ కేంద్రాల్లో 21,756 సొంత భవనాలు, 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని వివరించారు. 23,424 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని... వాటిని అమలు చేస్తున్నామని, వాటిలో కొన్ని భవనాలు నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. 2922 భవనాల నిర్మాణాలను అమలు చేశామని.. వీటిలో 948 అంగన్‌వాడీ భవనాలు పూర్తి దశలో ఉన్నాయని.. వాటికోసం రూ.4కోట్లు విడుదల అయ్యాయని చెప్పుకొచ్చారు. రూ.193 కోట్లు ఉంటే అన్ని అంగన్‌వాడీ భవనాలు పూర్తిచేయగలుగుతామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యూటీ ఇస్తామని స్పష్టం చేశారు. రాగి, జొన్నలను కూడా ఆహరంగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పడు అంగన్‌వాడీలకు స్టేషన్ రికగ్నిజైషన్ ఉండటంతో అందరూ సెంటర్లకు వస్తున్నారని పేర్కొన్నారు.
ఆ బాధ్యత టీచర్లకు, ఆయాలకు అప్పగిస్తున్నాం..
‘ముస్తాబు’ కార్యక్రమంతో అంగన్‌వాడీల్లోని పిల్లలు కూడా చక్కగా చదువుకొంటున్నారని మంత్రి సంధ్యారాణి వివరించారు. 547 కేంద్రాలు రిపేర్లలో ఉన్నాయని, 9240 కేంద్రాల్లో టాయిలెట్స్, 11,400 కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించామని అన్నారు. అంగన్‌వాడీల్లోని పిల్లలు బరువు పెరుగుతున్నారో లేదో చూసుకొనే బాధ్యత కూడా టీచర్లకు, ఆయాలకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. అంగన్‌వాడీల్లోని పిల్లల హాజరు.. గతంలో 70శాతం ఉంటే.. ఇప్పడు 93శాతం ఉందన్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉందని చెప్పుకొచ్చారు. 20వేల కేంద్రాలకు ఇండక్షన్ స్టౌలు ఇచ్చామని తెలిపారు. ఇండోర్ గేమ్స్, చార్ట్‌లు, పిల్లలకు ఈ ఏడాది అందించామని వెల్లడించారు.
అంగన్‌వాడీలకు జీతాలు పెంచాం..
అంగన్‌వాడీలకు గతంలో రూ.4200 జీతం ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,500 జీతం పెంచామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తమ ప్రభుత్వం అంగన్‌వాడీలకు మూడు సార్లు జీతం పెంచిందని చెప్పుకొచ్చారు. అంగన్‌వాడీలు పది డిమాండ్లు అడిగితే వాటిలో 9 పూర్తి చేశామని తెలిపారు. రూ.75 కోట్లతో 5జీ ఫోన్లను అంగన్ వాడీలకు ఇచ్చామని వివరించారు. జనాభా ప్రాతిపదికన కొత్త అంగన్‌వాడీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంగన్‌వాడీల అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి మాటిచ్చారు.
కాగా, శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైసీపీ సభ్యులు మాధవరావు, కల్యాణి, భరత్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం
Read Latest Telangana News And AP News And Telugu News