Share News

ప్రభుత్వానికి తలనొప్పిగా టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం

ABN , Publish Date - Mar 05 , 2026 | 07:04 AM

తణుకు పురపాలక సంఘం జారీ చేసిన టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కొనుగోలు దారులకు ఊరటనిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మీమాంసలో పడేసింది.

ప్రభుత్వానికి తలనొప్పిగా టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం
Tanuku TDR Bonds Issue

  • తణుకు టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం మళ్లీ మొదటికి..

  • వైసీపీ హయాంలో 21 ఎకరాల సేకరణకు రూ.800 కోట్లు

  • కూటమి ప్రభుత్వంలో రూ.44 కోట్లకు విలువ తగ్గింపు

  • గజాల లెక్కన కాకుండా ఎకరాల్లోకి మారుస్తూ నిర్ణయం

  • హైకోర్టును ఆశ్రయించిన బాండ్ల కొనుగోలుదారులు

  • గత బాండ్‌లనే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలు

  • ప్రభుత్వం నిర్ణయం కోసం మునిసిపాలిటీ ఎదురుచూపు

(భీమవరం-ఆంధ్రజ్యోతి): తణుకు పురపాలక సంఘం జారీ చేసిన టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం (Tanuku TDR Bonds Issue) ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కొనుగోలు దారులకు ఊరటనిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మీమాంసలో పడేసింది. వైసీపీ హయాంలో రూ.800 కోట్ల విలువైన బాండ్‌లను జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మాజీ మంత్రితోపాటు, వైసీపీ పెద్దల ఆశీస్సులతో నాటి మున్సిపల్‌ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. మాస్టర్‌ ప్లాన్‌ను అడ్డం పెట్టుకుని కంపోస్ట్‌ యార్డు విస్తరణ పేరిట ఇంకొన్ని బాండ్‌లు జారీచేశారు. వ్యవసాయ భూములను గజాల రూపంలో లెక్కించి బాండ్‌లు ఇచ్చేశారు.


గజం స్థలం మార్కెట్‌ విలువ రూ.6 వేలు ఉంటే దానిని రూ.21 వేలకు పెంచి నాలుగు రెట్లు విలువైన బాండ్‌లు మంజూరు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తణుకు పురపాలక సంఘం ప్రతిష్ట దెబ్బతింది. టీడీపీ నాయకులు అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. దాంతో నాటి వైసీపీ ప్రభుత్వం దిగొచ్చింది. బాండ్‌లను బ్లాక్‌లిస్టులో పెట్టింది. బాండ్‌లు పొందిన వారంతా వాటిని ఇతరులకు విక్రయించేశారు. విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో నిర్మాణదారులు బాండ్‌లు కొనుగోలు చేసుకున్నారు. వాటిని వినియోగించుకుని అక్కడ ప్లాన్‌ పొంది పరిమితికి అదనంగా నిర్మాణాలు చేసుకున్నారు.


వ్యవసాయ భూముల ఆధారంగానే కొత్త బాండ్‌లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్‌ లిస్టులో వున్న టీడీఆర్‌ బాండ్‌లను రద్దు చేసింది. వాటి స్థానంలో గజాల లెక్కన కాకుండా వ్యవసాయ భూముల ఆధారంగా బాండ్‌లు ఇచ్చింది. అంటే ఎకరం స్థలం రూ.55 లక్షల వంతున లెక్క కట్టింది. అందుకు రెండు రెట్లు విలువైన బాండ్‌లను మంజూరు చేసింది. వాస్తవానికి తణుకు మున్సిపాలిటీ 21 ఎకరాల భూమిని సేకరించింది. వైసీపీ గజాల రూపంలో లెక్క కట్టి రూ.800 కోట్ల విలువైన బాండ్‌లు జారీచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాల్లో మంజూరు చేసింది. కొంత భూమికి రెండు రెట్లు, ఇంకొంత భూమికి నాలుగు రెట్ల విలువైన బాండ్‌లు జారీ అయ్యాయి. దాదాపు 80 ఎకరాల విలువైన బాండ్‌లు ఇచ్చారు. ఎకరానికి రూ.55 లక్షల వంతున వాటి విలువ రూ.44 కోట్లు మాత్రమే. వైసీపీ హయాంలో రూ.800 కోట్లు విలువ చేసే బాండ్‌లను కూటమి ప్రభుత్వం రూ. 44 కోట్లకు తగ్గించింది. ప్రభుత్వం ఈ బాండ్లను బ్లాక్‌లిస్టులో పెట్టడంతో తణుకులో జారీ అయిన బాండ్‌లను కొనుగోలు చేసిన వారు హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపాలిటీ జారీ చేసినందున బాండ్‌లను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆదేశాలతో కథ మళ్లీ మొదటి కొచ్చింది. ప్రభుత్వ నిర్ణయం కోసం తణుకు మున్సిపల్‌ అధికారులు ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 07:11 AM