ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:13 AM
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేశ్ ఇవాళ(బుధవారం) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2025 సెప్టెంబర్ 27వ తేదీన అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించి శాసనమండలికి పంపించామని ప్రస్తావించారు. అక్కడ బిల్లు ప్రవేశపెట్టలేదని... వంద రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని చెప్పుకొచ్చారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫ్యాక్షన్ రాజకీయాలపై యుద్ధం ప్రకటించారని గుర్తుచేశారు.
164 మంది కార్యకర్తలను చంపేశారు..
2004 తర్వాత దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 164మంది తెలుగుదేశం కార్యకర్తలను దారుణంగా చంపేశారని మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను పరామర్శించి వెళ్లే లోపే మరో హత్య జరిగిన పరిస్థితి ఉండేదని తెలిపారు. ఈ హత్యలకు గురైన వారి పిల్లలను చదివించేందుకు ఎన్టీఆర్ స్కూల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆ పిల్లలు ఫ్యాక్షన్‌లోకి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఉండేలా తాము చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో కూడా ఇలాంటి హత్యలు చాలా జరిగాయని ప్రస్తావించారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12వ తేదీన దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన నిలబడ్డారని.. ప్రజల కోసం పోరాడారని కీర్తించారు.
చంద్రయ్యను గొంతు కోసి చంపారు..
నడిరోడ్డుపై చంద్రయ్యను గొంతు కోసి చంపారని మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జై జగన్’ అంటే వదిలేస్తామని చెప్పినా చంద్రయ్య భయపడలేదన్నారు. వైసీపీ హయాంలో ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అన్నందుకు ఆయనను చంపివేశారని ధ్వజమెత్తారు. చంద్రయ్య హత్య ఎలా జరిగిందో దేశం మొత్తం చూసిందని అన్నారు. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వటం కోసం కూటమి పార్టీలు సమ్మతించాయని తెలిపారు. గతంలో శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించినా.. శాసనమండలి దాన్ని పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. కనీసం బిల్లుని తిరస్కరించినా.. మనం అసెంబ్లీలో ఆమోదించుకునేవాళ్లమని తెలిపారు. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని, ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి... ఇలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News