Share News

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:06 AM

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయిని కూర్మాన అరుణకుమారిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆధునిక విద్యా విధానంలో మార్పులు తెస్తూ, విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, మార్చి2 (ఆంధ్రజ్యోతి): సృజనాత్మక విద్యా బోధనతో విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లా టీచర్ కూర్మాన అరుణకుమారిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రత్యేకంగా అభినందించారు. జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న అరుణకుమారి వినూత్న పద్ధతులతో పాఠాలను బోధిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ పెట్టారు. అరుణకుమారి టీచర్ సంప్రదాయ బోధనకు భిన్నంగా సృజనాత్మక పద్ధతులను అనుసరిస్తున్నారని మెచ్చుకున్నారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలతో మాత్రమే కాకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలు రూపొందించడం, పాఠాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ తయారు చేయడం, వర్కింగ్ మోడల్స్ ద్వారా ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, పిల్లలతో ప్రత్యక్ష కార్యకలాపాలు చేయించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారని ప్రశంసించారు.


విద్యార్థుల్లో ఆసక్తి..

ఈ విధానం వల్ల విద్యార్థులు సులభంగా పాఠాలను అర్థం చేసుకుంటున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లల్లో నేర్చుకునే ఆసక్తి పెరుగుతోందని చెప్పుకొచ్చారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్, రాష్ట్ర, జాతీయ స్థాయి విద్యా శిక్షణల్లో కేఆర్పీగా, మాడ్యూల్ రచయితగా, ఈ–కంటెంట్ సృష్టికర్తగా అరుణ కుమారి టీచర్ ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆధునిక, సృజనాత్మక బోధన సాధ్యమేనని ఈ టీచర్ నిరూపించారని తెలిపారు. పరిమిత వనరులతో కూడా నాణ్యమైన విద్య అందించవచ్చని ఆమె చూపించారన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, పాఠశాలపై ఆసక్తి కల్పించడం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అరుణకుమారి టీచర్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.


విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగు..

వినూత్న డిజిటల్ బోధన చేస్తూ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. టీచర్ కృషి వల్ల విద్యార్థుల్లో ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని వివరించారు. ఆమె రాష్ట్రానికి స్ఫూర్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యాన్ని సాధించడంలో ఇలాంటి టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. టీచర్ సృజనాత్మక బోధన విధానం ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యారంగంలో నాణ్యత పెంపు కోసం పలు సంస్కరణలు చేపడుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరుణకుమారి వంటి ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థకు బలంగా నిలుస్తున్నారని మెచ్చుకున్నారు. అరుణకుమారి లాంటి టీచర్ల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. విద్యార్థుల హాజరు పెరుగుతోందని, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడుతోందని, ప్రభుత్వ విద్యా లక్ష్యాలు సాధ్యమవుతున్నాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 02 , 2026 | 11:58 AM