నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:10 PM
వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.
తిరుపతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి (Bhumana Karunakara Reddy) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు. ఇవ్వన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలే కరుణాకర్‌రెడ్డిని తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. తాను వ్యాపారస్థుడినని తనకు ఎన్నో అవకాశాలు వచ్చినా వద్దని టీటీడీకి వచ్చానని ప్రస్తావించారు. తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్‌లో ఇవాళ(ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. టీటీడీ శ్రీవారి దర్శనానికి సంబంధించి భారీగా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆ వివరాలు అన్ని తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఇవ్వనీ బయటపెడుతానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసిన దుర్మార్గాలన్నీ బయటపెట్టేవాడినని.. ఎన్ని స్కాములు ఉంటే అన్నీ బయట పెడతానని చెబితే సీఎం చంద్రబాబు తనను ఆపారని ప్రస్తావించారు. తిరుమల పవిత్రత దెబ్బతీయొద్దు... వీటిని ఆపమని హెచ్చరించారు. తాను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలేదని వార్నింగ్ ఇచ్చారు. చీప్ పాలిటిక్స్ వద్దని బీఆర్ నాయుడు హితవు పలికారు.
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణకు వారు భార్యతో రాలేదు
తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించానని... పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సతీసమేతంగా ఎందుకు రాలేదని తాను నిలదీశానని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ‘అది వారికి బాధకలుగుతుందని.. భార్య లేకపోతే వేరే సంగతి. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణకు భార్యతో రాలేదు. జగన్ కూడా భార్యతో రాలేదు. కొన్ని ఫొటోలూ 20, 25 ఏళ్ల కింద దిగిన ఫొటోలున్నాయి. 30 ఏళ్లుగా పరిచయాలున్నాయి.... వారి ఇంటికి మేము మా ఇంటికి వారు వస్తారు. నేను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే వాడిని కాదు. మార్ఫింగ్ చేస్తే ఊరుకునేది లేదు. వీడియోలో ఒకటి, రెండు చోట్ల మార్ఫింగ్ చేశారు. 20 ఏళ్ల కింద ఫొటోలనూ ఈ రోజు, నిన్న జరిగినట్లు చెబుతున్నారు. బాధితులు కూడా ఈ విషయంపై హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. వాస్తవాలను ఫిర్యాదు చేశానని... మరో అరగంటలో ఎఫ్ఐఆర్ వస్తుంది. ఆ వీడియోల్లో వల్గారిటీ ఏమి ఉంది?. ఫిర్యాదు చేస్తే నా ఫ్యామిలీ చేయాలని.. లేదా ఆ వీడియోల్లో ఉన్నవారు చేయాలి. రేపు వన్ మేన్ కమిషన్ వస్తోంది. దాన్ని డైవర్ట్ చేయటానికే ఇదంతా చేస్తున్నారు. దొంగలకు డైవర్షన్ పాలిటిక్స్ తెలుసు. లీగల్‌గా ఫైట్ చేస్తా.. ఇలాంటి బెదిరింపులకు భయపడను. నేను మీడియాలో ఉన్నా... నీకు... సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తా’ అని బీఆర్ నాయుడు హెచ్చరించారు.
ఏ ఫైల్ చూసినా అన్నీ దొంగ లెక్కలే..
చెన్నైకి పోయి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఏమి చేశారో బయట పెట్టమంటారా..?, ఏ ఫైల్ చూసినా అన్నీ దొంగ లెక్కలేనని బీఆర్ నాయుడు ఆరోపించారు. ‘నన్ను టీటీడీలో తప్పు పట్టడానికి ఒక్క పాయింట్ కూడా లేదు. నేనూ పరిశోధనాత్మక జర్నలిజం చేయించి వీళ్ల అంతు తేలుస్తా. ప్రపంచం మొత్తం తెలుసు జగన్ గజదొంగ అని... నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నా వల్ల టీటీడీకి చిన్న మచ్చ అయినా వచ్చిందా?, నేను తప్పు చేశానా..? నేను రిఫార్మ్స్ చేయాలని టీటీడీకి వచ్చాను. నాకు ఇది బతుకు తెరువు కాదు. నా వ్యాపారాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కోటి పుస్తకాలు భగవద్గీత పేరుతో రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ భగవద్గీతలో ఏమీ లేదు. ఆ పుస్తకాల వెనుక కరుణాకర్‌రెడ్డి కొడుకు ఉన్నారు. వీఐపీల దర్శనాల్లో నా కోటాలో 50 శాతం కూడా నేను ఇవ్వటం లేదు. బంధువులకు, మిత్రులకు నిష్టూరం అయిపోయాను. నా అంతట నేను నియంత్రించుకున్నా... నేను నిస్వార్థంగా ఉండి పని చేస్తుంటే... రోజూ బురదజల్లుతున్నారు. నువ్వు, నీ అడిటర్లు రావాలి.. నా పుస్తకాలు ఓపెన్‌గా పెడతా చూడు. నాతో కలవాలని, మాట్లాడాలని చాలా రకాలుగా ట్రై చేశారు. నేను అవకాశం ఇవ్వలేదు’ అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News