విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:01 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి కోసం సిఫారసులేవి? అని ప్రశ్నించారు. టీచర్ల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ ఇదని విమర్శించారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్‌కు విలువేముంది..? అని నిలదీశారు.
పేద విద్యార్థులు విద్యకు దూరం..
విద్యాశాఖకు మంత్రి లేరనే విషయాన్ని కూడా గుర్తించని కమిషన్ ఎందుకు? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. చాక్ పీసులకు పైసల్లేక, స్కావెంజర్లు లేక స్కూళ్లు అల్లాడుతుంటే పరిష్కార మార్గాలు చూపరా..? అని ఫైర్ అయ్యారు. కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45కు పెంచడం దుర్మార్గమని అన్నారు. పేద విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా రూపొందించిన ఏకపక్ష నివేదిక ఇదని ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయులకు అవమానం..
ఉపాధ్యాయులను విద్యా కమిషన్ అవమానించిందని బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా విదేశాల్లో తిరిగి నివేదిక ఇస్తే ఒరిగేదేముంది..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపాధ్యాయులారా...మీకు అండగా బీజేపీ ఉంటుందని భరోసా కల్పించారు. ఇళ్ల కూల్చివేతలో రేవంత్‌రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయమని ఎద్దేవా చేశారు. మావోయిస్టుల విషయంలో రేవంత్‌రెడ్డిది ద్వంద్వ వైఖరి అని ఆగ్రహించారు. అర్బన్ నక్సలైట్లను కమిటీల్లో వేస్తారని... లొంగిపోయిన మాజీలను ప్రోత్సహిస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ కన్నుమూత
మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీ
Read Latest Telangana News And AP News And Telugu News