Share News

చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ కన్నుమూత

ABN , Publish Date - Feb 27 , 2026 | 06:26 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయానికి ఆధ్యాత్మిక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ అర్చకులు, పండితులు డా. ఎమ్.వి. సౌందర రాజన్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిలుకూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ కన్నుమూత
MV Soundararajan Death

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయానికి ఆధ్యాత్మిక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ అర్చకులు, పండితులు డా. ఎమ్.వి. సౌందర రాజన్ (MV Soundararajan) (90) ఈరోజు (శుక్రవారం) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిలుకూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం..

సౌందర రాజన్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఓ గొప్ప విద్యావేత్తగా, ఆధ్యాత్మిక నాయకుడిగా సమాజానికి సేవలు అందించారని కొనియాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


భక్తుల సంతాపం..

చిలుకూరు బాలాజీ ఆలయ భక్తులు, పండితులు, ప్రజాప్రతినిధులు సౌందర రాజన్ సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహనీయుడు సౌందర రాజన్ మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని తెలిపారు. విద్యావేత్తగా, అర్చకుడిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని చెప్పారు. ఆయన చూపిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.


ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర..

సౌందర రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సేవలకు అంకితం చేశారని అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ఆయన విశేష కృషి చేశారని చెప్పుకొచ్చారు. భక్తుల్లో విశ్వాసం పెంపొందించడంలో, ఆలయ సేవలను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ‘వీసా బాలాజీ’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో ఆయన పాత్ర విశేషమని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.


ఆలయం రెండు రోజుల పాటు మూసివేత..

సౌందర రాజన్ మృతి నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఫిబ్రవరి 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మూసివేయాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం ఉండదని తెలిపారు. అనంతరం ఆలయాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసివేయడం ద్వారా ఆయనకు గౌరవ నివాళి అర్పిస్తున్నామని ఆలయ నిర్వాహకులు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ విద్యా రంగంలో సంస్కరణలు.. కీలక సిఫార్సులు చేసిన కమిషన్

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 06:44 PM