కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:26 PM
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
కాకినాడ జిల్లా, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడులో 18 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన సమయంలో 30 మంది కార్మికులు బాణసంచా కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన ఆయన విడుదల చేశారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఈ దురదృష్టకర ఘటన గురించి తెలియగానే కాకినాడ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నానని అన్నారు. కాకినాడ కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు. బాణాసంచా తయారీ పరిశ్రమ నుంచి ఇంకా పేలుళ్లు వస్తున్నాయని అధికారులు తెలిపారన్నారు. ఈ పేలుళ్లకు కారణాలపై విచారణ చేస్తున్నామని అన్నారు.
బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్పి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంత్రి కందుల దుర్గేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..
Read Latest Telangana News And AP News And Telugu News