నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 09:18 PM
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మార్చి 4వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపై మాట్లాడతానని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మార్చి 4వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపైన మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ సమావేశం నిర్వహణపై కొన్ని విమర్శలు వచ్చాయని.. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. ఇవాళ (శనివారం) సచివాలయంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రణాళికాబద్ధంగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా విభజించామని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని.. ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలని తెలిపారు. పారిశ్రామికీకరణలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా ఉండాలని.. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.
శాఖలపై అవగాహన ఉండాలి..
‘సేవా రంగంలో వస్తున్న పెను మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. శాఖలపై ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన ఉండాలి. శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు.. అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకూ సొంత భవనం ఉండాలి.. బడ్జెట్ ప్రతిపాదనలో వీటిని చేర్చాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలపై ప్రతి శాఖ దృష్టి పెట్టాలి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సర్వీస్ సెక్టార్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి.. ఆన్‌లైన్ విధానంలో అన్ని పనులూ జరిగేలా చూడాలి. ఈ ఫైల్ విధానం ఉండాలి. నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు , పెట్టుబడులు గ్రౌండ్ కావాలి. పాత కాలం సర్వర్లను అప్‌డేట్ చేసుకోవాలి. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి.. ఇందులో సాంకేతికతను వినియోగించుకోవాలి. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలి. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టాలి. ఫ్యూచర్ సిటీ దేశ ఆర్ధిక స్థితినిని మార్చబోతోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి..
మూసీనది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. ఇక్కడ వచ్చే మార్పులను ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించాలి. వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించబోతున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాలి. ప్రాంతాల వారీగా మెడికల్ డేటా తయారు చేయాలి. ప్రతి సెక్రటరీ తమ శాఖలల్లో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలి. మార్చి 6వ తేదీ నుంచి 99 రోజుల ప్రణాళిక జూన్ 12వ తేదీ వరకు జరగబోతుంది. జూన్ 2వ తేదీ వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రంగా కావాల్సిందే. జూన్ 2వ తేదీ తెలంగాణకు పండుగ.. పండుగను అంతా ఘనంగా జరుపుకోవాలి. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ప్రతి అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.. మినహాయింపులు ఉండవు. శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ప్రతి ఎన్నికలో ప్రజలు నాకు కావాల్సిన బలాన్ని ఇచ్చారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం ప్రజలకు మంచి చేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..
విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And Telugu News