Share News

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:30 PM

ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం
Tirumala laddu issue

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ మోషేను రాజు తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్. వైసీపీ సభ్యులు ప్రొసీజర్‌ను ఉల్లంఘిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులు తప్పుడు సంప్రదాయాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో గందరగోళం నెలకొనగా.. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కల్పించుకున్నారు. వైసీపీ సభ్యులు చేసిన ‘పొరపాటు’ అనే మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు.


ఈ అంశంపైనే మండలిలో కాసేపు హాట్ హాట్ డిస్కషన్ నడిచింది. వైసీపీ సభ్యులు సభలో ఒకే అంశంపై రెండు మోషన్‌లు ఎలా పెడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శాసనమండలి చైర్మన్ లేదని చెబుతున్నారు కదా..? అలాంటప్పుడు రెండు అంశాలను వైసీపీ సభ్యులు అజెండాలో ఎలా పెట్టారంటూ మరో మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. మీరు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకపోతే ఎలా అంటూ చైర్మన్‌ను నిలదీశారు మంత్రి పయ్యావుల.


చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దు: మంత్రి పయ్యావుల కేశవ్

శాసనమండలిలో చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దని మంత్రి పయ్యావుల కేశవ్ హితవు పలికారు. ఇంతలో మాట్లాడిన మండలి చైర్మన్.. స్వల్పకాలిక చర్చకు మాత్రమే అనుమతిస్తామని, ఆ తర్వాత ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇచ్చుకోవచ్చని చెప్పారు. పయ్యావుల కేశవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా.. వైసీపీ సభ్యులు రియాక్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి పయ్యావుల.. తాను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ సభ్యులు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ రోజు ప్రజలకు శ్రీవారి లడ్డూ విషయంలో నిజాలు తెలియజేయాలని స్పష్టం చేశారు. బట్టకాల్చి ముఖం మీద వేసిన తర్వాత వాకౌట్ చేసి వైసీపీ సభ్యులు వెళ్లిపోతామంటే కుదరదని ధ్వజమెత్తారు.


రాజకీయాలకు మండలిని వేదిక చేయొద్దు..

వైసీపీ సభ్యులు మాట్లాడి వెళ్లిపోతామంటే కుదరదని మంత్రి పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు. రాజకీయాలకు మండలిని వేదిక చేయొద్దని చెప్పారు. జగన్‌కు దేవదేవుడిపై ఎలాగూ నమ్మకం లేదని.. తిరుమలలో డిక్లరేషన్ కూడా ఇవ్వలేదని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యులు కూడా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు చార్జ్‌షీట్‌లో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారని పేర్కొన్నారు. దీనిపై పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పు చేసినవారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందన్నారు. వైసీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ 35వ పేజీలో ఉందని చెప్పారు. అది ఫిర్యాదు మాత్రమేనని వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి వాదనను మంత్రి అచ్చెన్నాయుడు కొట్టిపారేశారు. లడ్డూ నెయ్యిలో కల్తీ గురించి మాట్లాడకుండా ఎలాంటి సంబంధం లేని అంశాలను సభలో మాట్లాడటం మంచిది కాదని మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వైసీపీ సభ్యులు ఎంతసేపయిన మాట్లాడాలి... కానీ వాస్తవాలు మాట్లాడాలని స్పష్టం చేశారు. కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి చెప్పినా ఎందుకు ఈ విషయాన్ని తొక్కి పెట్టారని మంత్రులు నిలదీశారు. నెయ్యి కొనాలంటే పాలు అక్కరలేదని.. వైసీపీ హయాంలో టీటీడీ టెండర్ నిబంధనలు మార్చారని పయ్యావుల కేశవ్ ఆగ్రహించారు.


హెరిటేజ్ గురించి అలా ఎలా చెబుతారు: మంత్రి అచ్చెన్నాయుడు

వైష్ణవి డెయిరీ, సంఘం డెయిరీ ఒకటేనని వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. ఇందాపూర్, హెరిటేజ్ డెయిరీ ఒకటేనని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాత్రికి రాత్రి రెండు డైరీలు ఎలా కలుస్తాయని నిలదీశారు. గతంలో, ఇప్పుడు కూడా తిరుమల లడ్డూపై చర్చకు సిద్ధమని తాము చెబుతున్నామని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోతామంటే కుదరదని ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులను వాకౌట్ చేయకుండా చూడాల్సిన బాధ్యత శాసనమండలి చైర్మన్‌పై ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


యుద్ధ వాతావరణం..

ఏపీ శాసనమండలిలో యుద్ద వాతావరణం నెలకొంది. తిరుమల నెయ్యి కల్తీ అంశంపై చర్చ సందర్భంగా వివాదం రాజుకుంది. మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరి పై మరొకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల సభ్యులు వారిని అడ్డుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 03:03 PM