జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:29 PM
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరం ఐక్యంగా ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కూటమి చాలా బలంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరం ఐక్యంగా ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. కూటమి చాలా బలంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2019లో అది సాధ్యం కాలేదని.. 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్నచిన్న సమస్యలున్నా సర్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలు పరస్పర సహకారంతో పని చేయాలని తెలిపారు. ఏ వ్యవస్థలో లోపాలు ఏర్పడినా ప్రజలకు సేవ చేయటంలో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై పవన్ కల్యాణ్ ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీలో మాట్లాడారు.
నిధులను పారదర్శకంగా ఖర్చు చేశాం..
జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిధులను పారదర్శకంగా ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఎవరొచ్చినా వారు అడిగింది ఇవ్వటానికి తాను ప్రయత్నించానని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా తన శాఖల తరపున ఇచ్చిన నిధుల వివరాలు అందజేస్తున్నానని తెలిపారు.
బడ్జెట్ వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలుపెట్టుకుంటారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 15సంవత్సరాలు ఏపీ కోసం కూటమి పని చేస్తుందని వ్యాఖ్యానించారు. కూటమి బలంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. మంత్రులు కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ తమ శాఖల్లో బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పర్యాటక రంగంలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ధాన్యం రైతులకు 24గంటల్లో డబ్బులు జతచేశామని వెల్లడించారు.
తాగునీటి సమస్య పరిష్కరిస్తాం..
మూడువేల గ్రామాల్లో తాగునీటి సమస్య గుర్తించామని... అక్కడ తొలి ప్రాధాన్యంగా నీరు ఇస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీవ్యాప్తంగా 48వేల జనావాసాల్లో సురక్షిత తాగునీరు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. 2019 నుంచి 2024 మధ్య ఉపాధి హామీ పథకంలో రూ.610కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేశారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3,853కోట్లు రోడ్ల కోసం ఖర్చు చేశామని తెలిపారు. ఐదేళ్లలో 880 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే మనం 6వేల కిలోమీటర్లు వేశామని వెల్లడించారు. వైసీపీ హయాంలో అన్ని రోడ్లు 8,500కిలోమీటర్లు వేస్తే... మనం రెండేళ్లలో 17,500 కిలోమీటర్ల రోడ్లు వేశామని తెలిపారు. చిట్టచివర్లో ఉన్న ప్రజానీకానికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో తాము పనిచేశామని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు అభినందనలు..
ఇన్ని కష్టాలు, నష్టాలున్నా 11.75 ఆర్థిక వృద్ధిరేటు చూపించిన సీఎం చంద్రబాబుకు అభినందనలు. కోటి 11లక్షల సివిల్ కేసులు, 3కోట్లకు పైగా క్రిమినల్ కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారని అన్నారు. ఈ సమస్య పరిష్కరించాలని గవర్నర్ సూచించారన్నారు. మన వద్ద ఉన్న కోర్టుల సంఖ్య, సిబ్బంది సంఖ్య ప్రకారం ఈ కేసులు ఎప్పటికీ పరిష్కారమవుతాయో చెప్పలేమని అన్నారు. చాలా కోర్టుల్లో కనీస సౌకర్యాలు లేవని.. మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవని... న్యాయశాఖకు సరిపడా నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో 100 కోర్టు గదులకు నిధులు కేటాయించటం సంతోషమని చెప్పుకొచ్చారు. ఎవరిపైన కేసు నమోదైనా అది వ్యక్తిగతం కాదని.. వారి కుటుంబం పైనా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారని అన్నారు. కోర్టుల్లో మౌలిక సౌకర్యాలు, సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు చేయటం అత్యవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కు.. పవన్ కల్యాణ్ ధ్వజం
ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్
Read Latest International News And Telangana News And AP News And Telugu News