ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
ABN , Publish Date - Sep 14 , 2026 | 11:57 AM
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈరోజు (సోమవారం) ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు. గవర్నర్ శుక్లా దంపతులకు పూర్ణకుంభంతో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తొలి పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడారు. ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ చేయడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.
తొలి పూజ చేయడం ఆనందంగా ఉంది..
తెలంగాణ ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయని.. కానీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈరోజు 69 అడుగుల గణేశ్ మహారాజ్‌కు తొలి పూజ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీర్వాదంతో తాను తెలంగాణ ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చానని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
బడా గణపతిది 72 ఏళ్ల ప్రస్థానం: పొన్నం ప్రభాకర్
ఖైరతాబాద్ బడా గణపతిది 72 ఏళ్ల ప్రస్థానమని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ రోజు స్వామివారికి గవర్నర్ తొలి పూజ చేశారని చెప్పారు. క్యూర్ ఏరియాలోని అన్ని నిర్వహణ కమిటీలతో రెండుసార్లు మీటింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గత మూడేళ్లుగా మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. ఉత్సవాలు సక్రమంగా కొనసాగాలంటే భక్తుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని.. ఇప్పుడు గణపతిని కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న విపత్తును ఎదుర్కొని ప్రజలంతా సుఖసంతోతులతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
ప్రజలందరిపై ఆ గణనాథుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలి: తలసాని
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లోని పంచముఖ సంకట హర మహా గణపతిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. స్వామివారి పూజల అనంతరం సన్మానించి గణపతి జ్ఞాపికను ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఖైరతాబాద్ గణపతి ఎంతో ప్రఖ్యాతి గావించిందని తెలిపారు. ఏకదంతుడు ప్రజలందరికీ ఆయురా ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న వారంతా వివిధ మాధ్యమాల ద్వారా ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలను తిలకిస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ గణపతికి గుర్తింపు ఉందని చెప్పారు. 69 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని చెప్పారు. ప్రజలందరిపై ఆ గణనాథుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి అంటే తొమ్మిది రోజుల పాటు నగరంలోని ప్రతి గల్లీ వినాయకుడి పూజలతో ఎంతో సందడిగా ఉంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్: సీఎం రేవంత్‌రెడ్డి
ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News