Share News

పార్లమెంట్‌లో చర్చలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు.. కేంద్రంపై ఎంపీ చామల ధ్వజం

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:27 AM

పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

పార్లమెంట్‌లో చర్చలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు.. కేంద్రంపై ఎంపీ చామల ధ్వజం
MP Chamal Kiran Kumar Reddy

ఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamal Kiran Kumar Reddy) వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. స్పీకర్ అనే వ్యక్తి లోక్‌సభలో ఉన్న సభ్యులు అందరికీ సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈరోజు(సోమవారం) లోక్‌సభ మీడియా పాయింట్‌లో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 18వ లోక్‌సభలో ప్రతిపక్షాలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.


తప్పుడు సంకేతాలు ఇచ్చేలా లోక్‌సభ తీరు..

రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడే ప్రతిసారి డిస్ట్రబ్ చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిశికాంత్ ధూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్‌సభను నడుపుతున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారని.. అందుకే లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టామని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్‌సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా కాకుండా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారని ఆరోపించారు.


ట్రంప్‌తో మోదీ కాంప్రమైజ్..

అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు ట్రంప్‌తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. లోక్‌సభలోని 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. గ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారని... ఈ విషయాలపై లోక్‌సభలో చర్చ జరగాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం: కేసీఆర్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 11:38 AM