రోడ్ల మీద కాదు.. సభకు వస్తే సమాధానమిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Sep 06 , 2026 | 02:06 PM
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకత్వం పక్కదారి పడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. రోడ్లపై మాట్లాడటం, ధర్నాలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాము సమాధానం చెబుతామన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 06: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకత్వం పక్కదారి పడుతోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. రోడ్లపై మాట్లాడటం, ధర్నాలు చేయడం కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాము సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. నాడు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పామని, చెప్పినట్టుగానే ఇచ్చామనీ ఆయన అన్నారు. అలాగే అర్హులందరికీ పార్టీలు చూడకుండా రేషన్ కార్డులు మంజూరు చేశామని కూడా ఆయన చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందిస్తున్నామని, పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని మంత్రి గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవడం లేదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు.. కాంగ్రెస్‌పై విషం చిమ్మతున్నాయని ఆరోపించారు. విపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని హితవు పలికారు. కేటీఆర్, హరీశ్‌రావులు.. అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కంటే ముందుగా తమ ప్రభుత్వ హయాంలో ఇదే అంశాలపై నాటి సీఎం కేసీఆర్‌ను ఎందుకు అడగలేదని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే మరికొంతకాలం రోడ్లపైనే ఉండాల్సి వస్తుందన్నారు.
చర్యలు తీసుకోవాలని ప్రజలే కోరుతున్నారు: మంత్రి
ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలే ఆయన్ను సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారన్నారు. 360 రోజులు విధులకు హాజరుకాకపోతే ఓ ఉద్యోగిని ఎలా తొలగిస్తారో.. అలాగే అసెంబ్లీకి హాజరుకాని అభ్యర్థులపైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో పేదలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. 'అల్లుడు, బిడ్డ వస్తే ఎక్కడ పడుకోవాలి?' అని అప్పట్లో మాట్లాడిన కేసీఆర్.. ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లైనా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుస్తోందన్నారు. తమ హయంలో ఇప్పటివరకు 70 వేల ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, విభజనను గతంలో అవహేళన చేసిన బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కులేదని వ్యాఖ్యానించారు.
కుంభకర్ణుడిలా పడుకున్నారు: ఎమ్మెల్యే గణేశ్
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కుంభకర్ణుడిలా పడుకున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు కేసీఆర్ మోసం చేశారని గ్రహించే ప్రజలు ఆయన్ను ఓడించారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నప్పటికీ పనిచేయడం లేదన్నారు. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
ఆ విషయాన్ని గమనించాలి: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కేసీఆర్ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వ్యాఖ్యానించారు. కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావులను ప్రజల మీదకు పంపారని.. వారేం మాట్లాడుతున్నారో కూడా ఆయన గమనించట్లేదని ఆమె అన్నారు. దాచుకోవడం, దోచుకోవడమే కేసీఆర్ పనని విమర్శలు గుప్పించిన స్వర్ణ.. పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!