ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూల స్పందన.. ఏపీ జేఏసీ నేతల హర్షం
ABN , Publish Date - Sep 06 , 2026 | 01:02 PM
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడం పట్ల ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్, సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడం పట్ల ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవులు, హెల్త్ కార్డులు, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తదితర అంశాలపై సీఎంతో జరిగిన చర్చల్లో పలు హామీలు లభించాయని చెప్పుకొచ్చారాయన. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం 5 డీఏల్లో రెండింటిని ఒకే నెలలో చెల్లిస్తామని, సరెండర్ లీవ్‌లకు సంబంధించి ఒక విడత చెల్లింపు చేస్తామని చెప్పారన్నారు. పోలీస్ ఉద్యోగులకూ సెప్టెంబర్ నుంచి అదనంగా మరో సరెండర్ లీవ్ ప్రకటించినట్లు వివరించారు.
అంతేకాకుండా.. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్యను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు విద్యాసాగర్ తెలిపారు. అయితే.. ప్రభుత్వం నుంచి హెల్త్ ట్రస్టుకు నెలకు రూ.36 కోట్ల మేర నిధులు జమకాకపోవడంతో ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, నగదు రహిత వైద్య సేవలకు ఆస్పత్రులు ముందుకు రావడంలేదని వివరించారు. వచ్చే నెల నుంచి ట్రస్టుకు నిధులు విడుదల చేస్తే మరో 3 నెలల్లో సమస్యను పరిష్కరించవచ్చని తాను చెప్పగా.. నిధులు బదిలీ చేసేందుకు అధికారులకు సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10 శాతానికి పెంచాలని కోరగా.. జనవరి 1 నుంచి అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇంటీరియమ్ రిలీఫ్‌పై కూడా ఆయన సానుకూలంగా స్పందించి, షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చారని విద్యాసాగర్ పేర్కొన్నారు.
ఇక.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చలు జరిగాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ చెప్పారు. 'ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించాం. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలపై కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ ఎప్పుడూ చర్చల మార్గాన్నే అనుసరిస్తుంది. కానీ ప్రభుత్వం స్పందించని స్థితుల్లో ఉద్యమానికి ఏ మాత్రం వెనుకాడబోం' అని హెచ్చరించారు. సెప్టెంబర్ 5న ఉద్యమ శంఖారావానికి సిద్ధమైన సమయంలో సీఎంతో చర్చలు జరగడం, అవి సఫలం కావడం శుభపరిణామమని విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు మనోహర్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సాయి ప్రసాద్‌లకు ఏపీ జేఏసీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల మూడో వారంలో రాష్ట్ర సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.
సీఎం స్పందన హర్షణీయం: ఏపీ జేఏసీ సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడం హర్షణీయమని ఏపీ జేఏసీ సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. సీఎంతో నిన్న జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని, తమ సమస్యలను ఓపిగ్గా విని పరిష్కారానికి భరోసా ఇచ్చినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు సహా గురుకులాలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశంపై చర్చలు జరిపినట్టు తెలిపారు ప్రసాద్. టెట్ పరీక్షలకు సంబంధించిన సమస్యలనూ సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ఆయన భరోసా ఇచ్చారని చెప్పారు.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!