మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!
ABN , Publish Date - Sep 04 , 2026 | 09:48 PM
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మానవ కార్యకలాపాలు హిమనదాన్ని కరిగిస్తున్నాయి. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ కొలువుదీరిన ఖుంబూ హిమనదిపై ఇంధన వినియోగంతో పాటు మానవ కార్యకలాపాలు కారణమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మానవ కార్యకలాపాలు హిమనదాన్ని కరిగిస్తున్నాయి. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ కొలువుదీరిన ఖుంబూ హిమనదిపై ఇంధన వినియోగంతో పాటు అధికంగా విడుదలవుతున్న మానవ మూత్రం కూడా మంచు కరగడానికి కారణమవుతోందని నేపాల్, అమెరికా శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. 2023 సీజన్‌లో బేస్‌క్యాంప్‌లో రోజుకు సుమారు 6,766 లీటర్ల మూత్రం పోగైనట్టు తెలుస్తోంది. మానవ శరీరం నుంచి సుమారు 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో బయటకు వచ్చే మూత్రం.. చల్లబడే క్రమంలో కొంత వేడిని మంచుకు అందిస్తుంది. అలా ఓ సీజన్‌లో మూత్రం ద్వారానే సుమారు 154 టన్నుల మంచు కరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు.
అయితే.. ఇది ప్రధాన కారణం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. బేస్‌క్యాంప్‌లో వంట, విద్యుత్, వేడి కోసం వినియోగించే ఇంధనమే అసలు ముప్పు. 2023 సీజన్‌లో అక్కడ 824 ఎల్‌పీజీ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్, 5,130 లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు అధ్యయనం పేర్కొంది. మానవ కార్యకలాపాల వల్ల జరిగే మంచు కరుగుదలలో వీటి వాటా సుమారు 94 శాతం కాగా.. మూత్రం వాటా 6 శాతం మాత్రమే.
బేస్‌క్యాంప్.. పెరుగుతున్న వేడి
ఏటా వేలాది మంది పర్వతారోహకులు, సిబ్బందితో బేస్‌క్యాంప్ సందడిగా మారుతోంది. వంటశాలలు, స్నాన సదుపాయాలు, జనరేటర్లు, వైఫై వంటి సౌకర్యాలతో భారీ స్థాయిలో తాత్కాలిక శిబిరాలు ఏర్పడుతున్నాయి. వీటి నుంచి వెలువడే వేడి ఖుంబూ హిమనదిపై స్థానిక ఉష్ణోగ్రతలను మరింత పెంచుతోంది. బేస్‌క్యాంప్ పరిసరాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు ఏటా సుమారు 0.28 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతున్నట్లు అధ్యయనం గుర్తించింది. వాతావరణ మార్పులతో ఇప్పటికే వేగంగా కరుగుతున్న హిమనదులకు ఈ మానవ వేడి మరింత సమస్యగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత బేస్‌క్యాంప్‌ను కొంత మేరకు తరలించే అవకాశాలనూ పరిశోధకులు పరిశీలించారు. ప్రస్తుతమున్న ప్రాంతానికి నైరుతి దిశలో రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించారు. అయితే అక్కడికి తరలించడం వల్ల కొత్త పర్యావరణ, రవాణా, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, సౌరశక్తిపై ఆధారపడటం వంటి చర్యలు తక్షణం చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.
ఇవీ చదవండి:
కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..
10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది