10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:29 PM
నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను ఆ దేశ సైన్యం రక్షించింది. ఇరుకైన సొరంగం నుంచి వారిని రక్షించిన వీడియోలను నేపాల్ ఆర్మీ అధికారులు విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను ఆ దేశ సైన్యం రక్షించింది. త్రిశూలీ 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన మెకానిల్ ఫోర్‌మ్యాన్ సంజయ్ షా(30), త్రిశూలీ 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్(45)లను టన్నెల్స్ నుంచి రక్షించినట్టు రెస్క్యూ టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం.. వారిరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అయితే.. 170 మీటర్ల లోతైన సొరంగం నుంచి వారిని రక్షించిన వీడియోలను నేపాల్ ఆర్మీ అధికారులు విడుదల చేశారు.
ఆ వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు ఇరుకైన చిక్కుకుపోయిన సొరంగంలోని గాలి గదిలోకి ఆర్మీ సిబ్బంది ప్రవేశించారు. టార్చ్‌లైట్ల సాయంతో టన్నెల్‌లోకి వెళ్లిన సిబ్బంది.. జారుతున్న బురద, నీటి మడుగులోనే తొలుత ఓ వ్యక్తిని స్ట్రెచర్‌పై కట్టి అతి కష్టమ్మీద బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇంకో వ్యక్తినీ అదే తరహాలో కాపాడారు. 4.5 కి.మీ. పొడవైన ఈ భారీ సొరంగ నిర్మాణంలోని లోతైన భూగర్భంలో సరిపడా ఆక్సిజన్‌తో పాటు అక్కడ చిక్కుకున్న నీటితో కూడిన స్థిరమైన గాలి గది ఉంది. అందులో చిక్కుక్కుపోయిన వారు.. ఆ గాలి గది కారణంగానే ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది.
కాగా.. వరద ఉద్ధృతి పెరిగి నీరు, బండరాళ్లు, మట్టి, బురద కొట్టుకొస్తున్న సమయంలో కార్మికులు ఆ టన్నెల్‌లోకి ప్రవేశించారని, తిరిగి వచ్చేందుకు మార్గం లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారని అధికారులు అంచనావేశారు. లోపల దొరికిన నీరు తీసుకుంటూ.. ఆ చీకటి, తేమతో కూడిన భూగర్భ వాతావరణంలో రోజులు గడిపారన్నారు. ఎట్టకేలకు 10 రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ వారిని గుర్తించి, క్షేమంగా బయటకు తీసుకువచ్చిందని చెప్పారు. అయితే.. ఇద్దరు వ్యక్తులను రక్షించడంతో.. ఆ ఇరుకైన సొరంగంలో చిక్కుకుపోయినట్టు భావిస్తున్న సుమారు 35 మంది కార్మికులపై ఆశలు మళ్లీ చిగురించాయి.
అయితే.. సొరంగంలో చిక్కుకుపోయి నిస్సహాయ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను 'హరే కృష్ణ' మంత్రాన్ని జపించానని సంజయ్ షా చెప్పారు. అందువల్లే తాను బతికి బయటపడ్డానని.. ఇది పునర్జన్మ లాంటిదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో తాను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించానని చెప్పిన సంజయ్.. ఆ క్రమంలో తానూ చిక్కుకుపోయానన్నారు. వరద నీరు, శిథిలాల నడుమ నిస్సహాయ స్థితికి చేరినట్టు ఆయన వివరించారు.
ఇవీ చదవండి:
పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్