Share News

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:46 AM

నేడు వరలక్ష్మీ శ్రావణ శుక్రవారం ఆఖరి వారం. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పాదగయాలో కొలువుదీరిన శ్రీపురుహూతికా దేవి అమ్మవారి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు.

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
Pithapuram Puruhutika Temple

కాకినాడ, సెప్టెంబర్ 04: నేడు వరలక్ష్మీ శ్రావణ శుక్రవారం ఆఖరి వారం. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పాదగయాలో కొలువుదీరిన శ్రీపురుహూతికా దేవి అమ్మవారి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో వారంతా సామూహిక వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారు. దాదాపు 12 వేల మంది ఆడపడుచులు ఈ వ్రతంలో పాల్గొనున్నారు. ఈ వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమంలో పాల్గొనే మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, చీర, రూపుతో కూడిన కానుకను జనసేన నాయకులు అందించారు.


అంతకుముందు ఈ దేవాలయంలో అమ్మవారికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కేకే పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఈ పూజా కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెండెం దొరబాబు, తుమ్మలబాబు పాల్గొన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.


మరో వైపు చివరి శ్రావణ శుక్రవారం కావడం.. మహిళా భక్తులు పోటెత్తనుండంతో.. ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈ వ్రతం ఆచరించడానికి వచ్చే మహిళలను ఐదు బ్యాచ్‌లుగా ఆలయ అధికారులు విభజించారు. ఈ పాదగయ క్షేత్రం.. అష్టాదశ శక్తి పీఠాలలో పదవదిగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - Sep 04 , 2026 | 08:59 AM