Share News

కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:20 PM

కెన్యాలో కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించిన నేపథ్యంలో టాటా కెమికల్స్ స్పందించింది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది.

కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..

ఇంటర్నెట్ డెస్క్: కెన్యాలో కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించిన నేపథ్యంలో టాటా కెమికల్స్ స్పందించింది. కెన్యా ఆర్థికాభివృద్ధిలో 2005 నుంచి తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్న టాటా.. పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పింది.


మైనింగ్, బ్లూ ఎకానమీ, మారిటైమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కోరిన సమాచారం సహా సంబంధింత డాక్యుమెంట్లను ఇప్పటికే సమర్పించామని టాటా కెమికల్స్ వెల్లడించింది. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చామని, తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. కెన్యా ప్రభుత్వ అధికారాన్ని తాము గౌరవిస్తామన్న టాటా కెమికల్స్.. చట్టపరమైన, నియంత్రిత్వ మార్గాల్లో చర్చించి సమస్యలను పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. తమ ఉద్యోగులు, మగాదీ కమ్యూనిటీ, భాగస్వాములు, కెన్యా ఆర్థికాభివృద్ధే తమకు ముఖ్యమని తెలిపింది.


కాగా.. టాటా కెమికల్స్‌ కెన్యాలో తన అనుబంధ సంస్థైన టాటా కెమికల్స్ మగాడి లిమిటెడ్(TCML) ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆఫ్రికాలోనే అతిపెద్ద సోడా యాష్ తయారీ సంస్థగా పేరుగాంచిన ఈ సంస్థ మైనింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది జులై 28 నుంచి నిలిచిపోయాయి.

తాజాగా అధ్యక్షుడి ఆదేశాల వార్తల నేపథ్యంలో శుక్రవారం టాటా కెమికల్స్ షేర్స్ 1.84 శాతం మేర నష్టపోయి రూ.630.15 వద్ద ముగిసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.14,584 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.


ఇవీ చదవండి:

10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..

Updated Date - Sep 04 , 2026 | 05:25 PM