‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:01 PM
కూతురు పంపిన ఓ చిన్న మెసేజ్‌కు తండ్రి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? ఆ అనుభూతి ఏంటి? అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..
ఇంటర్నెట్ డెస్క్: ‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ కూతురు పంపిన ఓ చిన్న మెసేజ్‌కు ఆ తండ్రి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. తన కూతుర్ని చూసేందుకు ఏకంగా 14 గంటలు ప్రయాణించి వచ్చిన తండ్రి.. కొన్ని గంటలపాటు ఆమెతో గడిపి తిరుగు పయనమయ్యారు. కూతురు పంపిన ఒక్క మెసేజ్‌కు 28 గంటల ప్రయాణం చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
@apple.kaivalya అనే యువతి ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. తనకు తండ్రి గుర్తుకు వస్తున్నారని, చూడాలని ఉందని కూతురు ముందు రోజు ఓ సందేశం పంపారు. మరుసటి ఉదయం తలుపు తీయగానే భుజాన బ్యాగుతో తన తండ్రి ఎదురుగా కనిపించడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. కుమార్తెను కలిసేందుకు ఏకంగా 14 గంటలు ప్రయాణించిన ఆయన.. సుమారు ఎనిమిది గంటలపాటు ఆమెతో గడిపారు. అనంతరం మరో 14 గంటలు ప్రయాణించి తిరిగి వెళ్లారు.
ఆ సమయంలోనూ తన పనులు, ఫోన్ కాల్స్‌ను ఫాలోఅప్ చేస్కుంటూనే కుమార్తెకు ఇష్టమైన పనులు చేసిపెట్టారా తండ్రి. ఇంట్లోని పాత్రలు శుభ్రం చేయడం, ఆమెను బయటకు తీసుకెళ్లడం, ఇష్టమైన ఫుడ్ తినిపించడం వంటి చిన్న చిన్న పనులు చేశారు. వెళ్లే ముందు 'హ్యాపీగా ఉండు.. నేనెప్పుడూ నీతోనే ఉంటా' అంటూ భరోసానిచ్చారు. ఈ ఘటనపై కూతురు స్పందిస్తూ.. 'నేను నాన్నను రమ్మని అడగలేదు. నేనెప్పుడూ ఒంటరిగా లేనని గుర్తుచేసేందుకే ఆయన ఇంత దూరం వచ్చారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. పలువురు నెటిజన్లు తండ్రి ప్రేమను కొనియాడుతూ భావోద్వేగ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
కెన్యాలో టాటా కెమికల్స్‌కు షట్‌డౌన్ ఆదేశం.. టాటా స్పందనిదే..
10 రోజులపాటు ఇరుకైన సొరంగంలో.. రక్షించిన ఆర్మీ సిబ్బంది