ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:54 PM
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్నిపార్టీలకు లేఖలు రాస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు.
బీజేపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టింది..
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. బీజేపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ వ్యతిరేకించినా ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కోటి మోసాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల హామీల అమలు చట్టం ఫైల్‌పై సంతకం చేశారని ఉభయ సభల్లో గత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగంలో చెప్పారని ప్రస్తావించారు.
కాంగ్రెస్ హామీలు పెద్ద ఫ్రాడ్..
840 రోజులు అయినా ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పెద్ద ఫ్రాడ్ అని ఎద్దేవా చేశారు. సీఎం సంతకం చేసిన ఫైల్ ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. ఈ ఫైల్ ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా..?, ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఒక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉందని.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల తరఫున ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నామని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి ఘోరీ కట్టారు: హరీశ్‌రావు
పది పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే
Read Latest Telangana News And AP News And International News And Telugu News