అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేశారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:44 PM
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు (సోమవారం) మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో గడ్డం వేణు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రస్తావించారు. రెండు పేజీల సూసైడ్ నోట్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, రాహుల్‌గాంధీకి రాశారని.. ఈ లేఖను వారికి షేర్ చేయాలని ఆయన తన సూసైడ్ నోట్‌లో తెలిపారని అన్నారు. గడ్డం వేణు రాసింది సూసైడ్ నోట్ కాదని కాంగ్రెస్ పాలనపై ఛార్జ్‌షీట్ అని చెప్పుకొచ్చారు.
యువత నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు..
వేణు రాసిన సూసైడ్ నోట్ సీఎం రేవంత్‌రెడ్డికి అందిందా...? రాష్ట్రంలో, దేశంలో యువత నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఢిల్లీ నుంచి పెద్ద వాళ్లను తీసుకువచ్చి బిల్డప్పులు కొట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అనలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ కనపడరని చెప్పుకొచ్చారు. సొంత నియోజకవర్గంలో యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే భట్టి ఎందుకు స్పందించరని ప్రశ్నల వర్షం కురిపించారు. 16,979 ఉద్యోగాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిందన్నారు. తమ హయాంలో 2లక్షల 32వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని ప్రస్తావించారు.
రేవంత్‌రెడ్డికి సప్లిమెంటరీలో పాస్ కావడం అలవాటు..
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను పట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటే రాహుల్ గాంధీలో ఎందుకు ఎలాంటి చలనం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఐటీ రంగంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రపంచంలో రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. 83 క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎం చేయడం క్రిమినల్ వేస్ట్ కాదా అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ.. రేవంత్‌రెడ్డిని నమ్మడం క్రిమినల్ వేస్ట్ అని వ్యంగ్యంగా అన్నారు. రేవంత్‌రెడ్డికి సప్లిమెంటరీలో పాస్ కావడం అలవాటని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే సప్లిమెంటరీలో రేవంత్‌రెడ్డి ఎంపీ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నడైనా పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు రాశారా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలుసు అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడిని కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోందని ధ్వజమెత్తారు.
ఆ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు..
అసెంబ్లీ సమావేశాలు 15రోజుల పాటు నడపాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పరిధిలో లేని వాటి గురించి మాట్లాడతారని విమర్శించారు. 21 ఏళ్లకే యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కన్నెపల్లి వద్ద నీళ్లు కిందకు పోతున్నా లిఫ్ట్ చేయకుండా రైతుల పొలాలను ఎండబెట్టింది ఈ క్రిమినల్ వేస్ట్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. వర్షాలు పడాలని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నానని తెలిపారు. ఎవరో ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News