Share News

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:40 PM

దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత
Kavitha

హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్‌రెడ్డి నిలబడే మాట్లాడుతున్నారని.. లేదంటే తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారని సెటైర్లు గుప్పించారు. ఈరోజు(బుధవారం) తెలంగాణ జాగృతిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు చేరారు. కండువా కప్పి జాగృతిలోకి కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.


కొత్త రాజకీయాలను పరిచయం చేస్తా..

రాసి పెట్టుకోండి.. తెలంగాణ భవిష్యత్, చరిత్రను మార్చే రోజు ఏప్రిల్ 25 అవుతోందని కవిత ఉద్ఘాటించారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటామని.. వారితోనే కలిసి పనిచేస్తామని మాటిచ్చారు. సామాన్యులతో, సామాన్యుల కోసం, సామాన్యులే ఉండేలా రాజకీయం తెస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేదెవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోందని చెప్పారు.


ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తా..

ప్రజల సమస్యల గురించి కాంగ్రెస్ హై కమాండ్‌ని పైసలు అడిగితే నో రాహుల్ జీ అని రేవంత్‌రెడ్డికి సమాధానం చెబుతున్నారని అన్నారు. కానీ కేరళ ఎన్నికల కోసం ఎంత ఖర్చయినా పెడుతున్నారని విమర్శించారు. అప్పర్ తుంగభద్రకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయేనని.. కానీ ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ఎందుకు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని నిలదీశారు. అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని మెయింటెయిన్ చేస్తూ ప్రజలను మాత్రం మోసం చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ జాగృతి తరఫున వచ్చే పార్టీ.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని భరోసా కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొత్త తరహా రాజకీయాలు, ప్రజల కోసం మంచి చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ అభివృద్ధి మోడల్ కేరళలో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: డీజీపీ శివధర్ రెడ్డి

కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు కట్టారు: మహేశ్ కుమార్ గౌడ్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 03:53 PM