కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు కట్టారు: మహేశ్ కుమార్ గౌడ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 09:53 PM
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకారం సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలి..
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి , టీపీసీసీ జనరల్ సెక్రటరీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ సంకల్పమని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ఆర్థిక విధ్వసాన్ని ఎత్తి చూపి తీరాల్సిందేనని అన్నారు.
బీఆర్ఎస్‌కి తెలంగాణ అభివృద్ధిపై ఓ విజన్ లేదు..
బీఆర్ఎస్‌కి తెలంగాణ అభివృద్ధిపై ఓ విజన్ లేకపోవడంతో నష్ణపోయిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు. మహత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల కాలంలో అధికారం పరమావధిగా కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. బీజేపీ హయాంలో పెట్రోల్, డీజిల్ రెట్లు తగ్గాయా? అని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? అని నిలదీశారు. శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడగటం బీజేపీ నేతల నైజమని విమర్శించారు.
కాళేశ్వరం కూళేశ్వరం అయ్యింది..
పిల్లల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ కావాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయం చైతన్యం కలిగిన జిల్లా మహబూబ్ నగర్ అని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నిత్యం అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కష్టపడితే ఫలితం వస్తుందని అనడానికి తాను టీపీసీసీ అధ్యక్షుడు కావడం ఓ ఉదాహరణ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష 20 వేల కోట్లు గోదావరిలో పోశారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూళేశ్వరం అయ్యిందని విమర్శించారు. ఫీడ్ లైవ్‌లో వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News