అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: డీజీపీ శివధర్ రెడ్డి
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:30 PM
అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, రోడ్ సేఫ్టీ అన్నిటికన్నా ముఖ్యమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సురక్షిత డ్రైవింగే అన్ని విధాలుగా మేలని పేర్కొన్నారు.
ములుగు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, రోడ్ సేఫ్టీ అన్నిటికన్నా ముఖ్యమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivdhar Reddy) వ్యాఖ్యానించారు. సురక్షిత డ్రైవింగే అన్ని విధాలుగా మేలని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) వెంకటాపురం మండల కేంద్రంలో అరీవ్ అలైవ్ కార్యక్రమానికి డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతి హాజరయ్యారు. ఈ సందర్భంగా రహదారి భద్రత రూల్స్ పాటిస్తామని ప్రమాణం చేయించారు.
అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపొద్దని వాహనదారులకు సూచించారు. కారు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయొద్దని అన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. హెల్మెట్ లేకపోవడం వల్లే 75 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వారే ఈ ప్రమాదాల బారిన పడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
అంతకుముందు ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరు అటవీ ప్రాంతంలో పోలీస్ ఔట్ పోస్ట్, ఇంటలిజెన్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌ను డీజీపీ శివధర్ రెడ్డి, ఐబీ చీఫ్ సుమతి, ప్రిన్సిపాల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ, సీఆర్పీఎఫ్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. కర్రెగుట్టల్లో రోడ్లు వేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పుకొచ్చారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. తీవ్రవాద ప్రాంతంలో ఇంత త్వరగా రోడ్లు వేయడం అభినందనీయమని అన్నారు. రోడ్లు వేయడంతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News