తెలంగాణ అభివృద్ధి మోడల్ కేరళలో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:25 PM
కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో సీఎంలుగా పనిచేసిన కరుణాకరన్, ఊమెన్ చాందీలు కేరళంను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తావించారు.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో సీఎంలుగా పనిచేసిన కరుణాకరన్, ఊమెన్ చాందీలు కేరళంను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తావించారు. ఈరోజు(మంగళవారం) కేరళంలోని కోవలం యూడీఎఫ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని.. దానిని తాము అభినందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా మంచి జరిగితే తాము అభినందిస్తామని తెలిపారు. సీఎం పినరాయి విజయన్ హయాంలోని వైఫల్యాలను తాము ఎత్తి చూపామన్నారు. పినరాయి విజయన్ హయాం ముగిసిందని.. 120 నెలల విజయన్ పాలన కాలం వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించారు.
మేము గెలవబోతున్నాం..
పినరాయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో తాము గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేరళంలో ఊమెన్‌చాందీ తరహా పాలన అందిస్తామని స్పష్టం చేశారు. కేరళంలో సరైన అవకాశాలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని చెప్పుకొచ్చారు. యువత వలస వెళ్లడంతో కేరళంలో వృద్ధులు... చిన్నపిల్లలే కనిపిస్తున్నారని ఇది దురదృష్టకరమని అన్నారు. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం సరికాదని.. వాళ్లు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందేలా చేస్తామని తెలిపారు. తెలంగాణలో మాదిరే అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు... స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం వంటివి కేరళంలో అమలు చేస్తామని మాటిచ్చారు.
మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలి..
పినరాయి విజయన్‌తో పాటు కేరళం కమ్యూనిస్టు మహిళా నాయకులను తాను తెలంగాణకు ఆహ్వానిస్తున్నానని.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తాము చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి తాము అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చని... ఈ విషయంలో తాను విజయన్‌కు సవాల్ విసురుతున్నానని అన్నారు. తాము 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని... 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,670 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని ప్రస్తావించారు. తాము హామీలన్నీ అమలు చేస్తున్నామని.. విజయన్ తెలంగాణకు వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చని సూచించారు. ఎన్నికలు కేరళం.. తెలంగాణ మధ్య కాదని.. యూడీఎఫ్.. ఎల్డీఎఫ్ మధ్యనే జరుగుతున్నాయని తెలిపారు. తాము ఏం చేస్తున్నామో అది చెబుతున్నామని.. తమ సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News