Share News

జీతాలు తీసుకుంటూ సభకు రారా.. కేసీఆర్‌పై సీఎం ధ్వజం

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:09 PM

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం ప్రభుత్వ కార్యక్రమాల జాబితా కాకుండా, భవిష్యత్తు తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

జీతాలు తీసుకుంటూ సభకు రారా.. కేసీఆర్‌పై సీఎం ధ్వజం
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం ప్రభుత్వ కార్యక్రమాల జాబితా కాకుండా, భవిష్యత్తు తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఈరోజు(బుధవారం) అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశయాలను ప్రతిబింబించిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని చూపించిందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలకు బలమైన పునాది వేసిందని తెలిపారు.


గొప్ప విజన్‌ను గవర్నర్ ఆవిష్కరించారు..

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం చారిత్రాత్మకమని ఉద్ఘాటించారు. గవర్నర్ చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచన కాదని.. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక అని తెలిపారు. అలాంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసనసభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లాకి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


కొందరిలో రాచరిక పోకడలు పోలేదు..

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వస్తారని అనుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త గవర్నర్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు చెబుతారని భావించామని.. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా... కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని తెలిపారు. ప్రజలే తప్పు చేశారని అనుకుంటున్నారని అన్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహించారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడూ అదే తీరుగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రూ.1.6కోట్లకు పైగా జీతభత్యాలు పొందారని ప్రస్తావించారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై సరైన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సూచించారు.


కేసీఆర్ సభకు రావాలి..

ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నర్ ప్రసంగంలో వివరించారని అన్నారు. సంక్షోభ సమయంలో దేశ ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. నెహ్రూ తీసుకున్న ప్రణాళికలతోనే ఇవాళ దేశం ఈ పరిస్థితుల్లో ఉందని తెలిపారు. మొదటి తరంలో నెహ్రూ- ఇందిరాగాంధీ గొప్ప విధానాలు తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక గతిని మార్చిన ఘనత పీవీ నరసింహారావుదని తెలిపారు. 1990 నుంచి 2020 వరకు 30 ఏళ్లు పీవీ నరసింహారావు నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఏఐ సునామీ రాబోతుందని చెప్పుకొచ్చారు. దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో ఒక పాలసీ డాక్యుమెంట్‌ను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారని అన్నారు.


తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌‌ చదివారా..?..

ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌‌ను కనీసం చదివారా..? చూశారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించకపోతే తర్వాత తరాలు మనల్ని క్షమించవని అన్నారు. ఇది నవశకానికి నాంది పలకాల్సిన సమయమని నొక్కిచెప్పారు. అధికారం కోల్పోయామనే దు:ఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలనే ఆలోచన ప్రధాన ప్రతిపక్షానికి లేదని ఆగ్రహించారు. అందుకే ఎవరు అడ్డుపడినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. అన్నిరంగాల మేధావులతో సమన్వయం చేసుకుని తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నామని వివరించారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ అస్తిత్వ శిఖరం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 09:31 PM