Share News

అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:13 PM

ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు.

అనవసరపు కాంట్రవర్సీలు వద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హుకుం జారీ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. మీ నియోజకవర్గం వరకు మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్రస్థాయి విషయాలు మాట్లాడవద్దని మార్గనిర్దేశం చేశారు. అనవసరపు కాంట్రవర్సీలు వద్దని సూచించారు. మీరే ప్రతిపక్షంలాగా ఇరుక్కోవద్దని అన్నారు. అసెంబ్లీకి సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని.. సభకు వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్తామంటే కుదరదని హెచ్చరించారు.


మూడుసార్లు అటెండెన్స్‌ తీసుకుంటాం..

అటెండెన్స్‌ను ఖచ్చితంగా మూడుసార్లు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అటెండెన్స్‌ ఉంటుందని సూచించారు. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు కూడా ప్రిపేర్ కావాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నేతల నెగిటివ్ మాత్రమే కాదని.. మనం చేస్తున్న పాజిటివ్‌ను కూడా ప్రజలకు చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ చేయలేదు కాబట్టే.. మనకు ప్రజలు అధికారం ఇచ్చారని... ఎంతసేపు వాళ్ల నెగిటివ్ చెప్పడం కాదని అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ నేతలు తమ ప్రభుత్వంపై కసి మీద ఉన్నారని... మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఒడిపోయారని.. మనం సీరియస్‌గా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీలను ఫుల్‌ఫిల్ చేయాలని.. ఎమ్మెల్యేలు స్టడీ టూర్‌కు వెళ్లాలని ఆదేశించారు.


మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం..

ప్రజా ప్రభుత్వంలో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రాధాన్యం, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా (Governor Shivpratap Shukla) తన ప్రసంగంలో వివరించారని తెలిపారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని అన్నారు. ఈరోజు(సోమవారం) సీఎల్పీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే విషయంపై దృష్టి సారించాలని సూచించారు. సభలో మాట్లాడే అంశాలపై ప్రభుత్వ విప్‌ల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృథా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.


ప్రతిపక్షంలో మనకు సమయమివ్వలేదు..

కేసీఆర్ హయాంలో.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి తమకు సమయం ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదని ఆగ్రహించారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు తనను సభకు రాకుండా చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని హుకుం జారీ చేశారు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని మార్గనిర్దేశం చేశారు. సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి పలు సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదని.. ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తోందని అన్నారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలని సూచించారు. ఇది మన ప్రభుత్వం.. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్‌నే వచ్చే ఎన్నికలకు అజెండా అవుతుందని అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

సీఎం రేవంత్‌రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీకి ఆయన బయలుదేరనున్నారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో సల్మాన్ కుర్షిద్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.


22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం..

మార్చి 22వ తేదీన నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. పామ్ ఫ్యాక్టరీ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.అనుబంధ శాఖలతో సమన్వయం పెంచాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 08:04 PM