తెలంగాణ అస్తిత్వ శిఖరం.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:10 PM
తెలంగాణ మట్టి వాసనను, ఉద్యమ ఉద్ధృతిని తన కలంతో పలకరించిన అక్షర యోధుడు నందిని సిధారెడ్డికు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ అవార్డు వచ్చింది.
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అక్షర వెలుగు, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు (Nandini Sidhareddy) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 లభించింది. ఆయన కవితా సంపుటి ‘అనిమేష’ లో కరోనా కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను హృద్యంగా చిత్రీకరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా, మంజీరా రచయితల సంఘం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఊపునిచ్చి, తెలంగాణ ఉద్యమానికి తన కవిత్వం ద్వారా గొప్ప సహకారం అందించి తెలంగాణ సాహిత్యానికి ఆయన గర్వకారణంగా నిలిచారు.
తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యం..
నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. తన కలం ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆత్మ, జీవన విధానాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణ సాహిత్యానికి అగ్రగామిగా నిలిచారు. ఆయన రచనలు కవిత్వం మాత్రమే కాకుండా తెలంగాణ జీవితం, ప్రజల సమస్యలు, ఉద్యమం వంటి అంశాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
మంజీరా రచయితల సంఘం..
మెదక్ జిల్లా కేంద్రంగా 'మంజీరా రచయితల సంఘం' స్థాపించి, ఎందరో వర్ధమాన కవులను, రచయితలను ప్రోత్సహించారు. సాహిత్యానికి ప్రాంతీయతను అద్దడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఈ సంఘం ద్వారా తెలుగు సాహిత్యంలో నూతనవాణి, విభిన్న అభివ్యక్తులు, సామాజిక చైతన్యానికి వేదికైంది. ఈ సంఘం తెలుగు సాహిత్యానికి కొత్త వన్నె తెచ్చి, యువ రచయితలకు ప్రేరణనిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన సృజనాత్మక రచనల ద్వారా చాటుతూ తెలంగాణ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చింది.
‘అనిమేష’ కవితా సంపుటి విశేషత
ఈ అవార్డు తెచ్చిపెట్టిన 'అనిమేష' కవితా సంపుటి కేవలం అక్షరాల కూర్పు కాదు అది ఒక కాలానికి దర్పణం. ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు, వలస కూలీల కష్టాలు, ఒంటరితనాన్ని ఈ సంపుటిలో కళ్లకు కట్టారు. ‘అనిమేష’లో కరోనా సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక, మానవ సంబంధ సమస్యలను నందిని సిధారెడ్డి హృద్యంగా చిత్రీకరించారు. మానవ సంబంధాల విచ్ఛిన్నత, సమాజంలో ఒంటరితనం, ఆందోళన, సామాజిక కలతలను ప్రతిబింబింపజేసే నందిని సిధారెడ్డి కవిత్వం పాఠకులకు ప్రేరణగా నిలుస్తోంది.
ఉద్యమ పాటల స్వరకర్త..
‘నాగేటి సాల్లల్ల నాతెలంగాణ(పోరు తెలంగాణ -2011)’ వంటి పాటల ద్వారా తెలంగాణ పల్లె జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజలను ఉర్రూతలూగించడమే కాకుండా, స్వరాష్ట్ర ఆకాంక్షను బలోపేతం చేశాయి. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో నందిని సిధారెడ్డి పాటలు, కవిత్వం ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు. ఆయన రచనలు రాష్ట్ర ఉద్యమానికి ఉత్సాహాన్ని నింపాయి.
పాటలు..
ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా (జై బోలో తెలంగాణ-2011), పుడమి పండుగ పువ్వుల జాతర మగువల పండుగ మమతల జాతర(కొలిమి), ఇది చర్రిత ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం (బందూక్- 2015), చెలియా చెలియా విడిపోకే కలలా( 2 కంట్రీస్ -2017)లాంటి వంటి పాటలను రచించారు.
ఉద్యమంలో కీలక పాత్ర..
ప్రజల సమస్యలను కవిత్వం ద్వారా తెలియజేయడం, ఉద్యమ కవిగా ప్రజల అభిమానాన్ని పొందడం ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో నందిని సిధారెడ్డి కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ సాహిత్యానికి గౌరవం..
నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం తెలంగాణ సాహిత్యానికి, సమాజానికి, సాంస్కృతికంగా గర్వకారణమని సాహితీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయన కృషి, తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్టమైన సేవలు గుర్తింపుగా నిలిచాయి. తెలంగాణ ఆత్మ, జీవితం, సంస్కృతిని ప్రపంచానికి చాటిన రచయితగా నందిని సిధారెడ్డి ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని సాహితీ లోకం తెలిపింది.
తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, భాషా సాహిత్యాల వికాసం కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్‌గా నందిని సిధారెడ్డి సేవలు అందించారు. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు అనేక పుస్తకాలను ఆయన వెలుగులోకి తెచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News