Share News

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:22 PM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చిందని ధ్వజమెత్తారు.

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
Harish Rao

హైదరాబాద్, మార్చి15 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చిందని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలాగా (ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్) మారారని ఎద్దేవా చేశారు. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్‌ది అభివృద్ధి మంత్రం అయితే రేవంత్‌రెడ్డిది విధ్వంసమని ఆరోపించారు. ఈరోజు(ఆదివారం) ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో అంజుమన్ గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ముస్లిం మహిళలకు రేషన్ కిట్స్ అందజేశారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ సలీం ఉన్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు.


షాదీముబారక్‌ అమలు చేయడం లేదు..

మైనార్టీ నాయకులు సలీం రూ.10వేలతో కిట్లను పంపిణీ చేశారని హరీశ్‌రావు ప్రశంసించారు. కేసీఆర్ నిరుపేదల గురించి ఆలోచించి షాదీ ముబారక్ పథకంతో లక్ష రూపాయలను అందించేవారని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షాదీముబారక్‌ను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క మంచి పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఇమామ్, మోజమ్‌లకు వేతనం పెంచుతామన్నారని, తులం బంగారం ఇస్తామన్నారని.. ఏ ఒక్కటి అయినా ఇచ్చారా.? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో తాగునీటి ఇబ్బందులు పరిష్కరించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు.


కేసీఆర్ కిట్ మాయం..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్ ఎందుకు మాయమైందని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని గుర్తుచేశారు. ప్రజలందరి దయ, అల్లా దయతో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మళ్లీ మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. రంజాన్ నెల పవిత్ర మాసమని ఏదైనా కోరుకుంటే జరుగుతుందని చెప్పుకొచ్చారు. నేడు ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో ఉందని తెలిపారు. సిలిండర్ దొరకడం లేదని.. నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరి ఇబ్బందులు తొలగిపోవాలని దేవుడిని ప్రార్థించాలని అన్నారు. మళ్లీ అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుందామని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొండగట్టును అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్

ఆ జిల్లాలో దారుణం.. అచ్చం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘటన రిపీట్

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 15 , 2026 | 12:52 PM