Share News

కొండగట్టును అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్

ABN , Publish Date - Mar 14 , 2026 | 08:12 AM

కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కొండగట్టును అభివృద్ధి చేస్తాం:  బండి సంజయ్
Bandi Sanjay Kumar

కరీంనగర్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అంజన్న ఆశీర్వాద’ పేరుతో ఈరోజు(శనివారం) మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి దేవాలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది.


కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం కొండగట్టుకు ఈ పాదయాత్ర చేరుకోనుంది. బీజేపీ శ్రేణులు ఈ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పది వేలమంది పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్‌లో విజయం సాధించామని పేర్కొన్నారు.


బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదు..

మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు ఈ పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ వివరించారు. పదోతరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పాదయాత్ర కొనసాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ ఎన్డీయే కూటమి మిత్రుడేనని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి టీటీడీ నిధులను పవన్ కల్యాణ్ కేటాయించారని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హయాంలో చెప్పారని.. కానీ చర్యలు మాత్రం చేపట్టలేదని ఆగ్రహించారు.


తుంగతుర్తి ఎమ్మెల్యే మాటలను ఖండిస్తున్నా..

ఎంఐఎంను తాము భూస్థాపితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ‘సర్వేజన సుఖీనోభవంతు‌ మా నినాదం’ అని చెప్పుకొచ్చారు. తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణుల మీద మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు. హిందువుల గురించి అనుచితంగా మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ సర్కార్‌లో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మళ్లీ ఎలా గెలిస్తారో చూస్తామని హెచ్చరించారు. తుంగతుర్తిలో ఆయన పతనం ప్రారంభమైందని ధ్వజమెత్తారు. హిందు దేవుళ్లను మోసం చేసి మరో దేవుడు దగ్గరకు ఆయన ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మీద మత విధ్వేషాలను రెచ్చిగొట్టినందుకు కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే కారణం.. మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజం

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 08:26 AM