Share News

టూరిస్ట్ బస్సు బోల్తా.. నలుగురి మృతి

ABN , Publish Date - Mar 13 , 2026 | 07:39 AM

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

టూరిస్ట్ బస్సు బోల్తా..  నలుగురి మృతి
Bus Accident

నిజామాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ప్రమాదం ఎలా జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టూరిస్ట్ బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం గన్నారం గ్రామ శివారులోని బ్రహ్మంగారి ఆలయం దగ్గర చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించారు.


నలుగురు అక్కడికక్కడే మృతి..

ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడిన సమయంలో తీవ్ర గాయాల కారణంగా వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


పలువురికి తీవ్ర గాయాలు..

ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇతర పెద్ద ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం. వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.


పోలీసుల దర్యాప్తు..

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు శ్రమించాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అయింది. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీ మద్యం కేసు.. కవితకు సీబీఐ నోటీసులు

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 08:29 AM