Share News

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:26 PM

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి
Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈరోజు (గురువారం) ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక శిక్షణా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.


ఆ బాధ్యత మనపై ఉంది..

తమ ప్రభుత్వం 6 తేదీ నుంచి 99 రోజుల పాటు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రూపొందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సర్పంచ్‌గా ఆ వ్యక్తి ఉంటే గ్రామం అభివృద్ధి జరిగిందని చెప్పుకునేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారులు కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లు వారు ఉన్నప్పుడు మంచి పనులు జరిగాయని ప్రజలు చెప్పుకోవాలన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత, ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత మనపై ఉందని చెప్పుకొచ్చారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. మార్చి 31వ తేదీ లోపు అభివృద్ధి పనుల కోసం నిధులు మళ్లీ వస్తాయని.. వచ్చిన నిధులను ప్రణాళికబద్ధంగా, ప్రజలకు ఉపయోగపడేలాగా వినియోగించాలని మార్గనిర్దేశం చేశారు.


నిధులను సద్వినియోగం చేసుకోవాలి..

సర్పంచ్‌లకు మునుపే ట్రైనింగ్ ఇచ్చారని, వారి విధులు ఏంటి, మీరు ఎలా పని చేయాలనే విషయాలు ఇప్పటికే అర్ధమై ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వేసవిలో తాగునీరు సమస్య లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. ఏ గ్రామ పంచాయతీకి అత్యధిక నిధులు వచ్చాయో ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య భాగస్వామ్యం అయ్యేలా పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్‌నకు.. మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఎంపీ చామల

దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి ఊరట

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 12:34 PM