దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
ABN , Publish Date - Mar 11 , 2026 | 10:45 AM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు.
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత (MLA Disqualification Verdict) పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు.
దానం నాగేందర్, కడియం శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వీరు పని చేస్తున్నారని.. వీరి శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు(బుధవారం) విచారణ చేపట్టారు. ఈ విచారణలో తాము ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
దానం, కడియం వాంగ్మూలాలను (statements) పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. వీరిద్దరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అనర్హత వేటు పిటిషన్లను కొట్టేశారు. దీంతో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట లభించినట్లయ్యింది. ఇదిలాఉంటే.. రేపు (గురువారం) సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై విచారణ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసు మళ్లీ విచారణకు వచ్చేలోగా స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు వెలువరించారు.
దానం నాగేందర్ ఏమన్నారంటే..
స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా పోరాటం ఆపనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏరోజు పనిచేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనకు ఎప్పుడూ విప్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ పరిధిలో తాను ఎక్కడా పోరపాటు చేయలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రిసార్ట్‌లో సౌకర్యాలు ఉండేవి ఇలాగేనా.. వారిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
Read Latest International News And Telangana News And AP News And Telugu News