Share News

నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య

ABN , Publish Date - Mar 12 , 2026 | 09:38 AM

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో గుద్ది, కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.

నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య
Nizamabad incident

నిజామాబాద్ జిల్లా, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ ఈరోజు (గురువారం) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామస్థాయి రాజకీయాల్లో పెరిగిన విభేదాలు చివరకు రక్తపాతం వరకు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఘటన ఎలా జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఇమ్మడి గోపీపై ఆయనకు బంధువైన సతీశ్ దాడి చేశాడు. ముందుగా కారుతో గుద్ది, అనంతరం కత్తితో దాడి చేసి గోపీని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాల కారణంగా గోపీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం సతీశ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


శత్రుత్వంగా మారిన రాజకీయాలు..

సతీశ్, ఇమ్మడి గోపీకి వరుసకు మేనల్లుడు. ఒకే కుటుంబానికి చెందిన వారైనా, గ్రామ రాజకీయాల్లో ఏర్పడిన విభేదాలు వారిద్దరి మధ్య తీవ్ర శత్రుత్వంగా మారాయి. గ్రామంలో రాజకీయంగా ఇద్దరూ ప్రభావం చూపే స్థాయిలో ఉండటంతో, కాలక్రమేణా వీరి మధ్య విభేదాలు పెరిగాయి. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.


సర్పంచ్ ఎన్నికలే విభేదాలకు కారణమా?

గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గౌరవరం గ్రామంలో సర్పంచ్ పదవికి ఇమ్మడి గోపీ భార్య పోటీ చేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో సతీశ్ భార్య కూడా సర్పంచ్ పదవికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన భార్య ఓడిపోయారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య రాజకీయంగా తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. గ్రామ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చిన్న చిన్న విషయాలపై కూడా ఇరువర్గాల మధ్య తగాదాలు జరిగేవని సమాచారం.


గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి..

ఇమ్మడి గోపీ హత్యతో గౌరవరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన తెలిసిన వెంటనే గ్రామానికి పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భద్రతను పెంచారు. స్థానికంగా గోపీ కీలక నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గోపీ మరణంతో గ్రామ ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


పోలీసుల దర్యాప్తు..

హత్య చేసిన తర్వాత సతీశ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్యకు అసలు కారణాలు ఏమిటి..?, ముందుగా ప్రణాళికతోనే గోపీని హత్య చేశాడా..? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా చూస్తే కుటుంబ రాజకీయ విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి ఊరట

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 10:22 AM