ఆ రెండు పార్టీలు ‘రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి జీవిస్తున్నాయి.. బండి సంజయ్ సెటైర్లు
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:19 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
హైదరాబాద్, జులై 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. ’కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారని విమర్శించారు. ‘రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి నటనలో జీవిస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని ఆరోపించారు.
కాళేశ్వరాన్ని కాంగ్రెస్ కోమాలోకి నెట్టింది..
ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల పాపాలకు తెలంగాణ రైతన్నలే బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ఎన్డీఎస్ఏపై నెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
బ్యారేజీ మరమ్మతులు చేయాల్సింది కాంగ్రెస్ సర్కార్‌నే..
బ్యారేజీ మరమ్మతు పనులు చేయాల్సింది కాంగ్రెస్ సర్కార్‌నే... బాధ్యత వహించాల్సింది కూడా ఈ ప్రభుత్వానిదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే మూడుసార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదేపదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో వేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరపకుండా రూ.9 వేల కోట్ల అవినీతిపై విచారణకే పరిమితమైంది నిజం కాదా? అని నిలదీశారు. ఆ కేసులో సూత్రధారులను అరెస్ట్ చేసి జైల్లో వేయకుండా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కేంద్రంపై రుద్ది తప్పుకున్నది నిజం కాదా? అని అడిగారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
విజిలెన్స్ నివేదికను బయటపెట్టే దమ్ముందా?..
అసలు విజిలెన్స్ నివేదికను బయటపెట్టే దమ్ముందా? అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాపాలను రేవంత్‌రెడ్డి మోయడం వెనుక మతలబు ఏమిటి? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలోనూ రెండున్నరేళ్లు జాప్యం చేసింది మీరు కదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంటే చర్చను దారి మళ్లించేందుకు ఎన్డీఎస్ఏకు అప్పగిస్తామంటూ కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి, నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు పక్కనపెట్టాలని హితవు పలికారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బలికాక తప్పదని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News