Share News

రాష్ట్రాల వారీగా బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. తెలంగాణకు సునీల్ బన్సల్

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:02 PM

బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది.

రాష్ట్రాల వారీగా బీజేపీ కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. తెలంగాణకు సునీల్ బన్సల్
BJP announcses New State In Charges

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జ్‌లను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం ఈ నియామకాలను ప్రకటించారు. అందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీకి హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ బాధ్యతలు అప్పగించగా.. ఆ రెండు రాష్ట్రాలకు సిద్ధార్థ్ శంభు కో-ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్‌ పార్టీ వ్యవహారాల బాధ్యతలను సునీల్ బన్సల్‌కు అప్పగించారు. తెలంగాణకు అభయ్ పాటిల్, రేఖా శర్మ కో-ఇన్‌ఛార్జ్‌లుగా నియమితులయ్యారు. బెంగాల్‌కు లాల్ సింగ్ ఆర్య, రాజేంద్ర సింగ్, పింకీ కుష్వాహా కో-ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు.


దేశంలో కీలకంగా భావించే ఉత్తర్‌ప్రదేశ్‌ పార్టీ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పర్యవేక్షించనున్నారు. జగదీశ్ పటేల్, మేధా కులకర్ణి, ప్రదీప్ శర్మ, అనంత్ ఓజా సహకార బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా నియమితులవ్వగా.. అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తానవాడే, కమల్‌జీత్ సెహ్రావత్ కో-ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.


ఇక.. ఢిల్లీ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధేను నియమించారు. జమ్యాంగ్ త్సెరింగ్ నంగ్యాల్, దర్శనా జర్దోష్ కో-ఇన్‌ఛార్జ్‌లుగా ఉంటారు. బీజేపీ మరో ఉపాధ్యక్షుడైన రామ్ మాధవ్‌కు ఉత్తరాఖండ్ బాధ్యతలు అప్పగించగా.. అరవింద్ మీనన్, బాన్సురీ స్వరాజ్ ఆయనకు అసోసియేట్స్‌గా నియమితులయ్యారు. ఈ జాబితాలో తమిళనాడు బాధ్యతలను రామ్ మాధవ్‌కు కాకుండా ఇతర నాయకులకూ అప్పగించారు.


మరోవైపు.. పార్టీ కమ్యూనికేషన్ విభాగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ మీడియా విభాగం, సోషల్ మీడియా యూనిట్‌ను కలుపుకునే కమ్యూనికేషన్ విభాగానికి అనిల్ బలూనీ సమన్వయకర్త నియమితులయ్యారు. ఇటీవల నేషనల్ మీడియా విభాగం కో-కన్వీనర్‌గా నియమితులైన ఆషిశ్ ఉషా అగర్వాల్‌కు కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.


null

ఇవీ చదవండి:

హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు

గాజాలో మళ్లీ మోగిన బడి గంట.. విద్యార్థుల ముఖాల్లో ఆనందం!

Updated Date - Sep 23 , 2026 | 05:11 PM