గాజాలో మళ్లీ మోగిన బడి గంట.. విద్యార్థుల ముఖాల్లో ఆనందం!
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:32 PM
గాజాలో వేలాది మంది విద్యార్థులు మరలా ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారు. దీంతో ఆ విద్యార్థుల ముఖాల్లో మళ్లీ ఆనందం వెల్లువిరుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత గాజాలో వేలాది మంది విద్యార్థులు మరలా ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారు. ఇజ్రాయెల్‌తో యుద్ధంతో అక్కడి పాఠశాల భవనాలు ధ్వంసమైనా.. తాత్కాలిక శిబిరాలు, టెంట్లు, దెబ్బతిన్న భవనాల్లోనే 2026-27 అకడమిక్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. క్లిష్ట పరిస్థితుల మధ్య పాఠశాలకు తిరిగొచ్చిన చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.
గాజాలో ఈ నెల 19న నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. యూనిసెఫ్ సహా అంతర్జాతీయ, స్థానిక సంస్థల సహకారంతో విద్యాశాఖ తాత్కాలిక విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం.. గాజా వ్యాప్తంగా తాత్కాలికంగా సుమారు 359 లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మూడేళ్ల తర్వాత పాఠశాలకు తిరిగొచ్చిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. 'మూడేళ్ల క్రితం చివరిసారిగా పాఠశాలకు వెళ్లాం. ఇప్పుడు మళ్లీ విద్యా ఏడాది ప్రారంభమైంది. ఇది ఆనందం, సంతోషం, విజయాలకు సంబంధించిన సంవత్సరం' అని చెప్పినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
కాగా.. యుద్ధం కారణంగా గాజాలోని 90 శాతం పాఠశాలలు ధ్వంసమైనట్టు యూనిసెఫ్ వెల్లడించింది. ఈ ఘర్షణల్లో సుమారు 22 వేల మంది విద్యార్థులు, 532 మంది ఉపాధ్యాయులు సహా మొత్తం 770 మందికి పైగా విద్యా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 6.6 లక్షల మంది విద్యార్థులు విద్యా కార్యకలాపాలకు దూరమైనట్లు అక్కడి విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యాశాఖ అధికారుల అంచనా ప్రకారం.. ఈ విద్యా ఏడాదిలో కనీసం 5.4 లక్షల మంది విద్యార్థులు తాత్కాలిక పాఠశాలలు, అభ్యసన కేంద్రాలు, విద్యా కేంద్రాల ద్వారా ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నారు. పాఠశాలలకు రాలేని వారి కోసం ఆన్‌లైన్ విద్యను కూడా ఏర్పాటు చేశారు అధికారులు.
ఇవీ చదవండి:
హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ