ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:43 AM
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తాయన్న వార్తలను ఈసీ వర్గాలు తోసిపుచ్చాయి. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు తలెత్తాయన్న వార్తలు దుమారం రేపుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం వర్గాలు స్పందించాయి. ఆ ఆరోపణల్ని ఖండిస్తూ.. ఎన్నికల కమిషనర్ల మధ్య ఎలాంటి అధికారిక విభేదాలూ లేవని తెలిపాయి. కమిషనర్లు చేసిన కొన్ని పరిశీలనలను మాత్రమే అధికారులు పరిశీలించారని పేర్కొన్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సహా ఈసీలు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభిప్రాయాలతోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) సహా అన్ని నిర్ణయాలూ ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో, ఏకాభిప్రాయంతోనే జరిగాయని స్పష్టం చేశాయి. ఈ కమిషన్‌లో ఏదైనా అంశంపై ఇద్దరు సభ్యులు ఏకాభిప్రాయానికి వస్తే మెజారిటీ నిర్ణయం అమలయ్యే నిబంధన ఉన్నప్పటికీ.. 'సర్' సహా కీలక నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. 10 నెలల్లో కనీసం 14 సార్లు కొన్ని నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. ముఖ్యంగా ఓటర్ల జాబితా, ఫారమ్-6లో మార్పులు, ఓటర్ల సమాచారాన్ని కేంద్రీకృతం చేయడం వంటి అంశాలపై వారు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపింది. ఓటర్ల నమోదు నిబంధన-1960లో సవరణలు చేయకుండా చట్టబద్ధమైన ఫారమ్‌లో మార్పులు చేయడం చట్టవిరుద్ధం, అనధికారికమని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. అభ్యంతరాలు ఉన్నప్పటికీ వాటిని సవరించలేదని తర్వాత వాటిని సంధు నమోదు చేశారని కూడా పేర్కొంది.
విమర్శల వెల్లువ
ఆ మీడియా కథనంతో ఈసీపై విమర్శలు ఎక్కుపెట్టాయి విపక్ష పార్టీలు. శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై తదితరులు ఈ అంశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ఆరోపణలు నిజమైతే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం పడుతుందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయాలపైనా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయని ఆయన అన్నారు. సీఈసీపై అభిశంసన తీర్మానాన్ని పరిశీలించాల్సిన అవసరముందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఇక.. ఈ విషయమై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. 'అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు' అని ఈసీపై దుమ్మెత్తి పోశారు.
ఇవీ చదవండి:
రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్