ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:35 AM
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే సూసైడ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే సూసైడ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. సాహిల్‌ను ఆత్మహత్యకు మోటివేట్ చేయడం, కుల వివక్ష సంబంధిత ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నేడు(బుధవారం) పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. పోలీసుల విచారణ అనంతరం ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలు, ఐఐటీ బాంబే ఇచ్చిన వివరణలు వంటి అంశాలన్నింటినీ దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.
10 మంది సభ్యులతో కమిటీ
సాహిల్ మృతి, అతడికి వేధింపులు ఎదురైనట్లు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, అధ్యాపకుల వ్యవహార శైలిపై విచారణ చేపట్టేందుకు ఐఐటీ బాంబే 10 మంది సభ్యులతో ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు సమచారం. ఈ కమిటీ వారం రోజుల్లో తమ నివేదిక సమర్పించే అవకాశముంది. విద్యార్థి సూసైడ్‌కు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, అతడి మృతిపై ఆయా వర్గాల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు వంటి వాటిని కమిటీ పరిశీలించనుంది.
కాగా.. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు సాహిల్ తల్లిదండ్రులు రవీంద్ర వాకోడే, సోనాలి వాకోడేల వాంగ్మూలాలను నిన్న(మంగళవారం) నమోదు చేశారు. తమ కుమారుడికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తండ్రి తెలిపారు. తన కుమారుడు పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలనూ ఆయన ఖండించారు. ఆ వదంతలన్నీ కేసును దృష్టి మరిల్చే ప్రయత్నమేనని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. ప్రొఫెసర్ సూర్యనారాయణకు ఐఐటీ బాంబే విద్యార్థులు మద్దతుగా నిలుస్తూ శాంతియుత నిరసన చేపట్టారు.
ఇవీ చదవండి:
రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్