Share News

డయాల‘సిక్‌’.. చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 01:44 PM

సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. మంజూరై నెలలు గడుస్తున్నా సేవలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో కిడ్నీ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

డయాల‘సిక్‌’.. చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు
Govt Hospital, Health

  • సిద్దిపేట, జనగామకు వెళ్లేందుకు తిప్పలు

చేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. మంజూరై నెలలు గడుస్తున్నా సేవలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో కిడ్నీ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ప్రభుత్వం సెంటర్‌ కేటాయించినా, అధికారులు చర్యలు వేగవంతం చేయకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో బాధితుల ఆశలు అడియాసలవుతున్నాయి.


zzz.jpgకిడ్నీ బాధితులకు తప్పని అవస్థలు

ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, పెయిన్‌ కిల్లర్ల అధిక వినియోగం వంటి కారణాలతో రోజురోజుకూ డయాలసిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. చేర్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో సుమారు 50 మందికిపైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. స్థానికంగా సేవలు అందుబాటులో లేకపోవడంతో వీరంతా రెండు రోజులకు ఒకసారి సిద్దిపేట, గజ్వెల్‌, జనగామ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆస్పత్రులకు వెళ్లినా బెడ్లు ఖాళీ లేక, స్లాట్‌ టైమ్‌ దాటిపోవడంతో రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


dia.jpgరూ.8 కోట్లతో భవనం పూర్తయినా..

గ్రామీణ ప్రాంత ప్రజల అవసరార్థం గత ప్రభుత్వ హయాంలో చేర్యాలలో రూ.8 కోట్లకు పైగా వ్యయంతో నూతన ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. డయాలసిస్‌ నిర్వహణకు అవసరమైన కనీస వసతులు కూడా కల్పించారు. గతేడాది నవంబరులో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భవనాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే డయాలసిస్‌ సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ హైమావతితో పాటు వైద్యాధికారులను ఆదేశించారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో పనులు మూలనపడ్డాయి.


అలసత్వంతో జాప్యం

జిల్లా పరిధిలోని నంగునూరు, చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం డయాలసిస్‌ కేంద్రాలను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు సమీక్షలు నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత పర్యవేక్షణ కొరవడటంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల సరైన సమయానికి వైద్యం అందక పలువురు బాధితులు అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. చేర్యాల ఆస్పత్రిలో డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తేవాలని బాధితులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్యాంకు సేవలకు 5 రోజుల బ్రేక్‌

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 01:44 PM