Share News

మత్తు దందాకు అడ్డేదీ?

ABN , Publish Date - Sep 25 , 2026 | 01:07 PM

కల్లులో కలిపే మత్తుమందు డైజోఫామ్‌ అక్రమ వ్యాపారం పాపన్నపేట మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

మత్తు దందాకు అడ్డేదీ?
TG News, Medak

  • జోరుగా డైజోఫామ్‌ అక్రమ వ్యాపారం

  • వరుసగా పట్టుబడుతున్నా తగ్గని రవాణా

  • పాపన్నపేట మండలంలో విచ్చలవిడిగా విక్రయాలు

  • భారీ లాభాలే లక్ష్యంగా రెచ్చిపోతున్న కేటుగాళ్లు

  • అధికారుల అండదండలతోనేనని చర్చ

పాపన్నపేట(మెదక్): కల్లులో కలిపే మత్తుమందు డైజోఫామ్‌ అక్రమ వ్యాపారం పాపన్నపేట మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు డైజోఫామ్‌ను అక్రమంగా తరలిస్తూ, విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు వరుసగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ఈ దందా మాత్రం అంతులేకుండా కొనసాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


వరుస ఘటనలు..

వారం రోజుల క్రితం మండలంలోని సీతానగరం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద డైజోఫామ్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తాజాగా యూసుఫ్‏పేట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను జోగిపేట మండల పరిధిలో ఎక్సైజ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డైజోఫామ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంతో మండలంలో ఈ మత్తుమందు అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో వేళ్లూనుకుందనే చర్చ సర్వత్రా మొదలైంది.


గతేడాది ఏడుపాయల జాతర సమయంలో పాడిచెన్‌పల్లి గ్రామంలో ప్రత్యేక బృందాలు భారీ మొత్తంలో డైజోఫామ్‌ను స్వాధీనం చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. కేసులు నమోదవుతున్నా, ఇందులో లాభాలు అధికంగా ఉండటంతో కొందరు ఈ ప్రమాదకర వ్యాపారాన్ని వదులుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జాతరలు, కల్లు విక్రయాలు అధికంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దీన్ని సరఫరా చేస్తున్నారనే చర్చ కూడా ఉంది.


ప్రధాన ఆదాయం మార్గంగా...

డైజోఫామ్‌ అక్రమ వ్యాపారంలో మార్జిన్‌ ఎక్కువగా ఉండటంతో కొందరు దీనినే ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చిన్నస్థాయిలో మొదలైన ఈ వ్యవహారం క్రమంగా విస్తరిస్తోంది. ఒకవైపు ఎక్సైజ్‌ అధికారులు నామమాత్రపు కేసులు నమోదు చేస్తుండగా, మరోవైపు కొత్త వ్యక్తులు ఈ దందాలోకి వస్తుండటం అధికారుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.


ఎవరి అండతో..?

పాపన్నపేట మండలంలో కొంతమంది డైజోఫామ్‌ వ్యాపారులకు ఎక్సైజ్‌ శాఖలోని కొందరు కిందిస్థాయి అధికారుల అండదండలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా డైజోఫామ్‌ పట్టుబడుతున్నా, అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడకపోవడానికి ఇదే కారణమనే వాదన స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవమెంత ఉందనేది ఉన్నతాధికారుల సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికైనా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, డైజోఫామ్‌ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్యాంకు సేవలకు 5 రోజుల బ్రేక్‌

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 01:07 PM